“టూ వరస్ట్” ఇంతమందా?

“నెలకో సర్వే…..పనితీరు మార్చుకుంటే…ఓకే…లేకుంటే ఇంటికే…ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. వచ్చే ఐదారు నెలల్లోనే అభ్యర్థులెవరో తేలిపోతుంది.” ఇదీ తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మధనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కటి మాత్రం ఫిక్స్ అయ్యారు. తన సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చిన వారికే టిక్కెట్లు అని చెబుతున్నారు. “ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. కావాల్సి వస్తే అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత టిక్కెట్ రాని వాళ్లకు మంచి అవకాశం ఉంటుంది. కాని అభ్యర్థుల గెలుపునకు అందరూ సహకరించాలి. లేకుంటే పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంటుంది.” అని చంద్రబాబు గత రెండు రోజులుగా చేస్తున్న హెచ్చరికలతో టీడీపీ నేతలు డీలా పడ్డారు.

నెలకోసారి సర్వే……

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు గుర్రాలకే టిక్కెట్లని చంద్రబాబు మొహం మీదే చెప్పేస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే జాతకం తన వద్ద ఉందని, వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో? ప్రజలకు ఎంతవరకూ అందుబాటులో ఉంటున్నారో? తాను ఇక్కడి నుంచే చెప్పగలనని పార్టీ సమీక్ష సమావేశాల్లో చేస్తున్న హెచ్చరికలు నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. చంద్రబాబు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా కాకుండా ప్రతి నెలా ఒక ప్రయివేటు సంస్థ చేత నియోజకవర్గాల వారీగా సర్వే చేయిస్తున్నారు. అందులో ఎమ్మెల్యే పనితీరుతో పాటు చంద్రబాబు పనితీరు, నియోజకవర్గంలో ప్రజల సంతృప్తిపై ఎక్కువగా ఈ సర్వే సాగుతుంది.

ఎమ్మెల్యే పనితీరు విషయంలో…..

అయితే గత రెండు నెలల నుంచి వస్తున్న సర్వే ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు 75 శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకరకంగా ప్రభుత్వానికి పాజిటివ్ రిజల్టే. అలాగే చంద్రబాబు పనితీరుపై కూడా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు వల్లనే అభివృద్ధి సాధ్యమయిందని నమ్ముతున్నారు. కాని ఎమ్మెల్యేల పనితీరు వద్దకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకుండా ప్రయివేటు పనులు, కాంట్రాక్టులకే పరిమిత మవుతున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదన్న సర్వే ఫలితాలు చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఆ నలభై మంది……

దాదాపు నలభై మంది ఎమ్మెల్యే పనితీరు “టూ వరస్ట్” అని రిపోర్ట్ రావడంతో ఇక లాభం లేదనకున్న చంద్రబాబు వరుసగా సమీక్ష లు షురూ చేశారన్నది ఆ పార్టీ వర్గాల టాక్. ఆ 40 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమై వారి పనీతీరును వారికే వివరించనున్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలను వారిని అడిగే తెలుసుకోనున్నారు. వారికి మూడు నెలల సమయం ఇచ్చి అప్పటికీ పనితీరులో ఎలాంటి మార్పు రాకుంటే ఆ జిల్లాలో పార్టీ పదవి ఇచ్చి ఆ నియోజకవర్గం నుంచి వేరే వారిని పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. మొత్తం మీద చంద్రబాబు నిర్మొహమాటంగా నేతలకు చెప్పి టిక్కెట్లు మాత్రం గెలుపు గుర్రాలకే ఇవ్వాలని డిసైడ్ అయినట్ల సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*