న్యూ లుక్ కోసం చంద్రబాబు…?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోటలో భారీ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయా ? రాజ‌ధాని ప్రాంతంలో పార్టీ త‌ర‌ఫున‌ కొత్త ముఖాలు క‌నిపించ‌బోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి తిరుగులేదు. ఇక్క‌డ పార్టీ సంస్థాగ‌తంగా ఎంతో బలంగా ఉండటంతో పాటు సామాజిక వ‌ర్గ ఫ్యాక్ట‌ర్ కూడా నాయ‌కుల‌కు ప్ల‌స్ అవుతోంది. ఈ త‌రుణంలో ఇక్క‌డి నుంచి ఎవ‌రు పోటీకి దిగినా వారిదే విజ‌యం అన్న నమ్మకం. అందుకే ఈసారి కొంత‌మంది నాయ‌కులు గుంటూరు జిల్లాను ఎంచుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ మూడు ఎంపీ సీట్ల‌తో పాటు 12 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌ధాని ప్ర‌భావంతో పాటు ఇక్క‌డ చేసిన అభివృద్ధి నేప‌థ్యంలో క‌నీసం 15 సీట్ల‌ను టార్గెట్‌గా చేసుకుంది.

ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు…..

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ జిల్లా నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ప్ర‌ముఖులు ఆస‌క్తితో ఉన్నారు. వీరిలోఇత‌ర జిల్లాల‌కు చెందిన మంత్రులు సైతం ఉండ‌డం విశేషం. వీరిలో ప్ర‌ముఖంగా మంత్రి నారాయ‌ణ పేరు వినిపిస్తోంది. ఆయ‌న‌తో పాటు ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రంగారావుతో పాటు మైనారిటీ కోటాలో మ‌రో కొత్త పేరు వినిపిస్తోంది. దీంతో జిల్లా రాజ‌కీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయ‌నే చ‌ర్చ టీడీపీలో మొద‌లైంది.

మంత్రి నారయణకు ఇదే మక్కువా?

ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిపోయిన నారాయ‌ణ. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఆర్థికంగా అండ‌దండలు అందించి సన్నిహితుడిగా మారిపోయారు. ఆ బంధంతోనే ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేశారు. అయితే ఈసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని నారాయ‌ణ బలంగా నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే నియోజ‌క‌వ‌ర్గ వేట‌లో ప‌డ్డారు. ముందుగా సొంత జిల్లా అయిన నెల్లూరు నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావించారు. అయితే అక్క‌డ మ‌రో మంత్రి సోమిరెడ్డితో విభేదాలతో పాటు రెడ్డి సామాజిక‌వ‌ర్గ ప్రభావం అధికంగా ఉంటుద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

అందుకే మంగళగిరిని…..

నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసినా, రూర‌ల్ నుంచి పోటీ చేసినా రెడ్డి సామాజిక‌వ‌ర్గం అక్క‌డ బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ త‌న గెలుపు అంత సులువు కాద‌న్న నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌న్ను మంగ‌ళ‌గిరి మీద ప‌డింది. నెల్లూరు జిల్లాలో రెడ్ల డామినేష‌న్ ముందు త‌న హ‌వా సాగ‌ద‌ని భావించిన నారాయ‌ణ ఆ జిల్లాను వ‌దిలి గుంటూరు నుంచి పోటీచేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. సీఆర్‌డీయేలో క‌ల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించిన ఆయ‌న‌కు.. జిల్లా నాయ‌కుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌జ‌లు, రైతుల‌తో స‌మావేశాలు ఏర్పాటుచేసి రాజ‌ధానికి భూములిచ్చేలా రైతుల‌ను ఒప్పించిన విష‌యం తెలిసిందే!

గెలుపు ఈజీ అనేనా?

దీంతో గుంటూరుపై మ‌క్కువ పెంచుకున్నారు. అందుకే ఈ జిల్లాలోని మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయాల‌నుకున్న విష‌యాన్ని ఇప్ప‌టికే పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద కూడా చెప్పార‌ట‌. రాజ‌ధాని ప్ర‌భావంతో పాటు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌, కాపు, బీసీ కులాల ఈక్వేష‌న్ త‌న గెలుపున‌కు చాలా సులువు అవుతుంద‌న్న‌దే నారాయ‌ణ ప్లాన్‌. ఇక న‌రసారావు పేట నుంచి ఎంపీగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా త‌న‌యుడిని ప్రోత్స‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేసేది లేద‌ని చెప్పేసిన రాయ‌పాటి.. కొడుక్కి సీటు ఇప్పించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. రాయ‌పాటి త‌ప్పుకుంటే ఆయ‌న వార‌సుడికి చంద్ర‌బాబు ఎక్క‌డో ఓ చోట సీటు స‌ర్దుబాటు చేస్తారు. అది న‌ర‌సారావుపేట ఎంపీ అయినా కావొచ్చు… లేదా జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు అయినా కావొచ్చు. ఇప్ప‌టికే పార్టీలో రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌న్వ‌యం చేస్తోన్న రంగ‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ దిశ‌గానే ముందుకు వెళుతున్నారు.

బాపట్లోనూ అదే స్ట్రాటజీ…..

ఇక గుంటూరు ఈస్ట్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌రావు స్థానంలో మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఓ వ్య‌క్తిని రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ నుంచి మైనార్టీల్లో ఆర్థికంగా బ‌లంగా ఉన్న వ్య‌క్తుల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఇక లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన బాప‌ట్ల‌లో టీడీపీ జెండా ఎగిరి రెండు ద‌శాబ్దాలు అవుతోంది. ఇక్క‌డ నుంచి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీకి చాలా రోజుల త‌ర్వాత పున‌రుత్తేజం తేవ‌డంతో పాటు దూసుకుపోతోన్న వేగేశ‌న ఫౌండేష‌న్ అధినేత‌, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అయిన వేగేశ‌న న‌రేంద్ర‌వ‌ర్మ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. యువ‌నేత నారా లోకేష్ ఆయ‌న అభ్య‌ర్థిత్వం ప‌ట్ల సుముఖంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా టీడీపీలో ప‌లువురు కొత్త ముఖాల‌ను చూడ‌డం అయితే ఖాయంగానే క‌నిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*