చంద్రబాబు సక్సెస్ గ్యారంటీ….!

టీడీపీ అధినేత చంద్రబాబు నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న లీడర్. ఆయన నాయకత్వంపై టీడీపీ శ్రేణులు విశ్వాసం ఉంచడానికి అనేక కారణాలున్నాయి. దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు మనోస్థైర్యం కోల్పోలేదు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నా పట్టించుకోలేదు. కేవలం క్యాడర్ నే నమ్ముకున్న చంద్రబాబు మళ్లీ అదే క్యాడర్ పై ఆశలు పెట్టుకున్నారు. అందుకే ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అనుకూలంగా లేవని భావిస్తున్న చంద్రబాబు క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ప్రతికూల పరిస్థితులున్నాయని…..

ప్రత్యేక హోదా, నాలుగేళ్లు బీజేపీతో కలసి నడవటం చంద్రబాబు సర్కార్ కు ప్రతికూల అంశాలే. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అందిపుచ్చుకోవడం, పాదయాత్ర చేస్తుండటం చంద్రబాబుకు రాష్ట్రంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఈ విషయం తమ అంతర్గత సర్వేల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పన్నెండు గంటల దీక్ష, తిరుపతిలో సభ తర్వాత క్యాడర్ లో కొంత మేర విశ్వాసాన్ని చంద్రబాబు పాదుగొల్పారు.

క్యాడర్ లో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు…..

నేతల కన్నా ఎక్కువగా క్యాడర్ నే ఇష్టపడే చంద్రబాబు తిరుపతి లాంటి సభలనే ప్రతి జిల్లాలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు తర్వాత వేదికను విశాఖను ఎంపిక చేశారు. ఈ నెల 20వ తేదీన విశాఖలో మరో ధర్మ పోరాట సభను నిర్వహించనున్నారు. తిరుపతి సభ తరహాలోనే భారీ ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి క్యాడర్ ను తరలించాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. అలాగే ఈ నెలలో జరగనున్న మహానాడును విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మహానాడుకు ముఖ్య కార్యకర్తలను అందరినీ పిలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఎంపిక చేసిన కార్యకర్తలను మహానాడుకు ఆహ్వానించనున్నారు. వీరికి ప్రత్యేక ఆహ్మానాలు కూడా పంపితే బాగుంటుందని, వారిలో మన పార్టీ అన్న భావన ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇలా చంద్రబాబు తొలుత పార్టీ క్యాడర్ లో విశ్వాసాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అయితే బాబు సక్సెస్ అవుతారనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*