బాబు గారు…ఏడుగురు ఎంపీలు….!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు జోక్‌గా మారుతున్నాయి. ఆయ‌న ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డ ప్ర‌సంగించినా.. త‌న‌కు 25 మంది ఎంపీల బ‌లం ఇవ్వండి తానే ప్ర‌ధానిని నిర్ణ‌యిస్తాన‌ని, అప్పుడు ఏపీకి ఏం కావాలంటే.. అది వ‌స్తుంద‌ని అంటున్నారు. పోనీ.. ఇది నిజ‌మే అనుకుంటే.. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన చంద్ర‌బాబు ప్ర‌దానిగా మోడీని గెలిపించండ‌ని పిలుపు ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ అన్యాయం చేసింద‌ని, సో.. బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా.. గుజ‌రాత్‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించిన సీఎం.. న‌రేంద్ర మోడీకి ఓటేయాల‌ని తెలుగువారికి పిలుపునిచ్చింది చంద్ర‌బాబే! అయితే, ఆయ‌న ఈ విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నారు. ఇక‌, ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీకి 16మంది ఎంపీల‌ను గెలిపించారు.

18 మంది ఎంపీలున్నా…..

మ‌రి వీరు కాకుండా మ‌రో ఇద్ద‌రు వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీకి మ‌ద్ద‌తిస్తున్నారు. అంటే మొత్తంగా 18 మంది టీడీపీకి ఎంపీలు ఉన్నారు. మ‌రి వీరితో సాధ్యం కానిది.. మ‌రో ఏడుగురు ఉంటే చేస్తాన‌ని చెపుతుండ‌డం చెవుల్లో పూలు పెట్ట‌డం కాదా?! అనేది విశ్లేష‌కుల మాట‌. ఒక‌వేళ‌.. చంద్ర‌బాబుకు పాతికి మంది ఎంపీలు ఉన్నా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని అంటున్నారు. బాబు కేవ‌లం ఎన్నిక‌ల స్టంటులో భాగంగా ప్ర‌చారం చేస్తున్నాడు త‌ప్ప‌.. ఆయ‌న కు 25 మంది ఎంపీలు ఉన్నా.. ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మతా బెన‌ర్జీ పార్టీకి భారీ సంఖ్య‌లో ఎంపీలు ఉన్నార‌ని, అయిన‌ప్ప‌టికీ.. ఆమె కేంద్రాన్ని ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌ని, కేంద్రంపై పోరు చేయ‌డంలోనే వారు నిమ‌గ్న‌మ‌వుతున్నార‌ని అంటున్నారు.

బాబుకు తెలియక కాదు…..

వాస్త‌వానికి ఇలాంటివిష‌యాల‌న్నీ చంద్ర‌బాబుకు బాగా తెలిసిన‌వే. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల చెవుల్లో చ‌క్క‌గా క్యాబేజీలు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. దేశమంతా టీడీపీతో ఉందని, బీజేపీ తప్ప అన్నిపార్టీలు టీడీపీతో ఉన్నాయని చంద్రబాబు పేర్కొంటున్నారు. ఓకే ఇదే నిజ‌మైతే.. టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసంపై కేవ‌లం ఆప్ త‌ప్ప మిగిలిన పార్టీలు ఎందుకు పెద‌వి విప్ప‌లేదో చెప్పాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుపై ఉంది. వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపు ఇస్తున్నారే త‌ప్ప‌.. వీరితో ఏపీకి ప్ర‌త్యేక హోదా.. ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఏ విధంగా పోరాడ‌తారో చెప్ప‌డం లేదు. ఇక‌, ఇప్పుడు ఎలాగూ ఆయ‌న ప‌రిధిలో 18 మంది ఎంపీలు ఉన్నారు. వారితోనే ఏదైనా చేయాల‌ని అనుకుంటే చేయొచ్చు!

ప్యాకేజీపై పెదవి విప్పకుండా……

అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ రాజ‌కీయాలు మానుకుని ఏపీకోసం అంద‌రం క‌లిసి పోరాడ‌దామ‌ని పిలుపు ఇస్తున్నాడు. దీంతో మొత్తం ఐదుగురు వైసీపీ మాజీలతో క‌లిపి 24 మంది ఎంపీల మ‌ద్ద‌తును చంద్ర‌బాబు సాధించిన‌ట్టేక‌దా? ఇలా కూడా ముందుకు వెళ్లే ఆలోచ‌న చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు మాత్రం ఆదిశ‌గా ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌డం లేదు. తాము ధర్మపోరాటం చేస్తున్నామని, ధర్మమే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజ‌మే అయితే.. ప్ర‌ధాని మోడీ పార్ల‌మెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు కామెంట్ చేయ‌లేదు. చంద్ర‌బాబు ప్యాకేజీకి ఒప్పుకున్నార‌ని మోడీ కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం తెలిసిందే. మ‌రి దీనికి బాబు ఎందుకు త‌ప్పించుకుంటున్నారో తెలియాలి. ఏదేమైనా బాబు మాత్రం మ‌ళ్లీ తెలుగు ప్ర‌జ‌ల చెవుల్లో క్యాబేజీలు తురుముతున్నార‌న‌డంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*