బాబు పని మొదలు పెట్టేశారు ….!

ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో రాజకీయ ఎత్తుగడలు వేయడం ఎపి సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. త్వరలో ఎన్నికలు ఉంటాయన్న నేపథ్యంలో జనంలోకి దూకుడుగా వెళ్ళెందుకు చంద్రబాబు సకల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా వర్గాల వారీగా, కులాల వారీగా ప్రతి వారికి వ్యక్తిగత లబ్ది చేకూర్చే కార్యక్రమాలకు పదును పెడుతున్నారు. తాజాగా ఆయన ప్రకటించిన నిరుద్యోగ భృతి ఇప్పుడు ఎపి రాజకీయాల్లో వైసిపి, జనసేనలకు షాక్ ఇచ్చే పరిణామమే. ఎన్నికల హామీల్లో భాగంగా బాబు వస్తే జాబు, నిరుద్యోగ భృతి అంశాలు ఆయనకు ఓట్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

నాలుగేళ్ళుగా అమలు చేయకుండా …

నిరుద్యోగ భృతిపై విపక్ష వైసిపి గత నాలుగేళ్ళుగా పోరాడుతూనే వచ్చింది. బాబు వస్తే జాబు లేదని అంటూ, ఆయన వచ్చారు జాబు పోతుందంటూ ఎద్దేవా చేస్తూ జనంలోకి బాగా తీసుకువెళ్ళింది. ఈ ప్రచారానికి విరుగుడుగా సరిగ్గా ఎన్నికల ఏడాది తన హామీలకు తుది రూపు ఇస్తున్నారు చంద్రబాబు. ఏపీలోని 12 లక్షలమంది నిరుద్యోగులకు లబ్ది చేకూరేలా నెలకు వెయ్యిరూపాయలు నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నారు. ఫలితంగా ఖజానాపై ఏటా 8 వేలకోట్ల రూపాయలు భారం పడనుంది.

ఎదురుగాలి తట్టుకోవాలంటే….

అయినప్పటికీ రాష్ట్రంలో వీస్తున్న ఎదురుగాలిని అధిగమించడానికి ఇలాంటి స్కీమ్స్ ఆయనకు తప్పడం లేదు అని పరిశీలకులు భావిస్తున్నారు. నాలుగేళ్ళుగా అమలు చేయలేకపోయినా చివరి ఏడాది అయితే ఓటర్లు బాగా గుర్తు పెట్టుకుంటారన్న స్ట్రేటజీ అనుసరిస్తున్నారు బాబు. ఆధార్ ఆధారంగా నిరుద్యోగులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి ఈ సొమ్ము మళ్ళించే ప్రక్రియద్వారా జగన్, పవన్ వెంట యువత ఓట్లు టర్న్ కాకుండా చక్కటి స్కెచ్ గీసిన బాబు వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*