కొడుకు కాదు తండ్రేనట…గ్యారంటీ..!

చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రుపున బ‌రిలోకి దిగే అభ్యర్థి విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. కొంత‌కాలంగా జ‌రుగుతున్న అనేక ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. రాబోయే ఎన్నిక‌ల్లోనూ తన తండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డే పోటీ చేస్తారని ఆయన తనయుడు సుధీర్‌రెడ్డి ప్రక‌టించారు. ఈ మేర‌కు శ్రీకాళహస్తిలో సుధీర్ మీడియా ముందే స్వయంగా చెప్పడంతో శ్రీకాళ‌హ‌స్తి 2019 టీడీపీ అభ్యర్థి విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ త‌న తండ్రి పోటీ చేసే విష‌యంలో ఎలాంటి అనుమానాల‌కు తావులేద‌నీ, కొందరు కావాల‌ని చేస్తున్న ప్రచారంలో నిజం లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

మంత్రి పదవి పోయినప్పటి నుంచి…..

నిజానికి రెండేళ్ల క్రితం మంత్రి ప‌ద‌వి నుంచి ఉద్వాస‌న త‌ర్వాత గోపాల‌కృష్ణారెడ్డి అంత చురుగ్గా ఉండ‌డం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొంత గుర్రుగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడు సుధీర్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్యటిస్తున్నారు. 2004లో ఓడిన బొజ్జల ఆ త‌ర్వాత 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా గ‌తేడాది జ‌రిగిన ప్రక్షాళ‌న‌లో ఆయ‌న్ను చంద్రబాబు కేబినెట్ నుంచి త‌ప్పించేశారు. నిజానికి చాలా కాలంగా బొజ్జల‌కు ఆరోగ్యం స‌రిగా ఉండ‌టం లేద‌ని తెలిసింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టే పార్టీ కార్యక్రమాల్లో ఆయ‌న తిర‌గ‌లేక‌పోతున్నారు.ఇక మంత్రి ప‌ద‌వి పోయిన‌ప్పటి నుంచి ఆయ‌న మ‌రింత డ‌ల్ అయిపోన‌ట్లు తెలుస్తోంది.

సుధీర్ పోటీ చేస్తారని…..

జిల్లాకు సీఎం చంద్రబాబు వ‌చ్చినా, అమ‌రావ‌తిలో చిత్తూరు జిల్లా నేత‌ల‌తో స‌మీక్షలు జ‌రిగినా ఆయ‌న వెళ్లడం లేదు. హాజ‌ర‌వ్వటం లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుధీరే పోటీ చేస్తార‌నే ప్రచారం జోరుగా జ‌రిగింది. ఇక గోపాల‌కృష్ణారెడ్డి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని విశ్రాంతి తీసుకుంటార‌నే టాక్ కూడా వినిపించింది. కానీ, సుధీర్ వీట‌న్నింటికి పుల్‌స్టాప్ పెట్టేశారు. నిజానికి శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గానికి బొజ్జల కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. టీడీపీ ఆవిర్బావం నుంచి ఆయ‌న పార్టీలో కొన‌సాగుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బొజ్జల‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి ఆరుసార్లు ఆయ‌న బ‌రిలోకి దిగి ఐదుసార్లు విజ‌యం సాధించారు.

చేజారి పోకుండా ఉండేందుకే…..

త‌మ కుటుంబంపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మకానికి ఇదే నిద‌ర్శన‌మ‌ని సుధీర్ అంటున్నారు. అంతేగాకుండా.. త‌న తండ్రి విజ‌యానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కూడా ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం. అయితే, త‌మ కుటుంబం నుంచి టికెట్ చేజారి పోకుండా ఉండ‌డం కోసమే సుధీర్ ఇలాంటి ప్రక‌ట‌న చేశార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ అధినేత‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా పార్టీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేపుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ తండ్రికి ఇస్తారా..? లేక త‌న‌యుడికి ఇస్తారా..? అన్న విష‌యం మాత్రం అంద‌రిలో ఉత్కంఠ‌ను రేపేతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*