ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయకుంటే….?

చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు చెప్పినా పార్టీ నేతలు తమ మొండి వైఖరిని వీడటం లేదు. అధికార పార్టీ కావడంతో సీటు ఖరారుపై టెన్షన్ తో ఇప్పటి నుంచే తెలుగు తమ్ముళ్లు తమ దారి తాము చూసుకుంటున్నారు. సీటు రాకుంటే….? అన్న వార్నింగ్ లు పరోక్షంగా పంపుతుండటం ఇప్పుడు పార్టీని ఆందోళనలో పడేస్తుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తెలుగుతమ్ముళ్ల సిగపట్లను చంద్రబాబు సీరియస్ గానే తీసుకోవాల్సి ఉంది. లేకుంటే పరిస్థితి మరింత చేయిదాటి పోతుందన్నది పార్టీ నేతల ఆందోళన.

టీజీ భరత్ వ్యాఖ్యలతో……

కర్నూలు సిటీ నియోజకవర్గానికి ఇటు టీజీ వర్గం, అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. తనకు ఎలాగైనా ఈసారి టిక్కెట్ ఇవ్వాలని టీజీ భరత్ పట్టుదలతో ఉన్నారు. నిన్న చంద్రబాబు పోటీలో ఉంటే తప్ప కర్నూలులో తనదే సీటు అన్న ధీమాను టీజీ భరత్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీజీ భరత్ వ్యాఖ్యలతో ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. మంత్రి నారా లోకేష్ వంటి వారు స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా వదలకుండా రాజకీయాలు చేయడం తగదని ఎస్వీ మోహన్ రెడ్డీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తప్పు పడుతున్న ఎస్వీ……

టీజీ భరత్ వ్యాఖ్యలను ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు ఎస్వీ మోహన్ రెడ్డి. అంతేకాకుండా తన ప్రమేయం లేకుండా బూత్ కమిటీ సమావేశాలను పెడుతుండటాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నారు. టీజీ భరత్ బూత్ లెవెల్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా కార్యకర్తల సమావేశాలను ఎలా పెడతారని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ తాను టీజీ ఫ్యామిలీ సహకారం కోసమే వెయిట్ చేశానని, ఇక శృతి మించిపోతుండటంతో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిందేనని ఎస్వీ మోహన్ రెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

అడుగుతున్న దాంట్లో తప్పేంటి?

కానీ టీజీ వర్గం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. టీజీ వెంకటేశ్ గతంలో చేసిన అభివృద్ధి, కర్నూలు నగరంలో తమకున్న పట్టును పరిశీలించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నారు. తాము ఊరికే సీటు ఇవ్వమని అడగటం లేదని, సర్వే చేసి మరీ ఎవరికి అనుకూలంగా ఫలితాలొస్తే వారికే ఇవ్వాలని తాము కోరడం తప్పా అని టీజీ వర్గం ప్రశ్నిస్తోంది. అయితే ఇద్దరూ పోటీ పోటీగా సమావేశాలు పెడుతుండటంతో పార్టీ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నేతలకు అయోమయంగా ఉంది. ఎవరి వెంట వెళ్లాలన్నది తేల్చుకోలేకపోతున్నారు. కొందరైతే ఇద్దరి సమావేశాలకు హాజరవుతున్నారు. కర్నూలు నగరంలో పార్టీ నేతల మధ్య విభేదాలను చంద్రబాబు తక్షణమే పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*