బాబు స్మార్ట్ గా స్టార్ట్ చేద్దామనుకుంటే …?

తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తుకు ముందడుగు వేస్తున్నారన్న టాక్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. అన్ని తాను అనుకున్నట్లు జరిగితే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో కెసిఆర్ సెప్టెంబర్ లో సమరశంఖం పూరించడానికి రంగం సిద్ధం అవుతారు. ఆయన వ్యూహాలు ఎలా వున్నా కెసిఆర్ ముందస్తుకు వెళితే ఏపీలో చంద్రబాబు సర్కార్ ఇబ్బందుల్లో పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణాలో లీడర్ లు లేకుండా క్యాడర్ మిగిలిన తెలుగుదేశానికి అక్కడ తిరిగి తలెత్తుకు తిరగాలంటే ఎదో ఒక పార్టీ అండదండలు బాగా అవసరం. అందుకే ఆయన కాంగ్రెస్ తో జతకట్టి తిరిగి అక్కడ పార్టీని స్ట్రాంగ్ చేయాలన్న లెక్కలో వున్నారు అన్నది పబ్లిక్ టాకే. అదే ఇప్పుడు చిక్కువచ్చి పడింది టిడిపికి. తెలంగాణాలో అవసరరార్ధం కాంగ్రెస్ తో జట్టు కడితే ఏపీలో పార్టీలోనే చీలిక వచ్చే పరిస్థితి తేలిపోయింది.

అక్కడ, ఇక్కడ లాభమే …

వాస్తవానికి ఎన్నికల ముందు ఎవరు ఎవరితో కలుస్తారో చెప్పలేని పరిస్థితి రాజకీయాల్లో ఎప్పుడు ఉంటుంది. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎవరి గోలలో వారు ఉండేవారు. కానీ తెలుగు రాష్ట్రాలు ఒక్కోదానికి ఒక్కోసారి ఎన్నికలు అంటే టిడిపి కి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందమే. పార్టీలో సీనియర్ల ధిక్కార స్వరం ఇప్పటికే అధినేత క్లాస్ తీసుకునే రేంజ్ లో పీక్ కి పోయింది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణాలో ముందస్తుకు సమాయత్తం కావాలంటే కాంగ్రెస్ తో జట్టు కట్టక తప్పదు. ఏపీలో కూడా జగన్ టిడిపి కి ప్రధాన ప్రత్యర్థి కనుక కాంగ్రెస్ పాత ఓటు బ్యాంక్ ఎంతోకొంత తమకు కలిసివస్తుందన్నది బాబు అంచనా.

ముందస్తు జరిగితే నష్టమేనా …?

ఇలా రెండు చోట్ల ప్రయోజనాలే లక్ష్యం చేసుకుని చంద్రబాబు అడుగులు వేస్తుంటే కెసిఆర్ ముందస్తుకు వెళుతూ బాబు ఆశలు అడియాసలు చేసేలా వున్నారు. కాంగ్రెస్ తో జట్టు కట్టి కూడా తెలంగాణాలో ఫలితం సాధించలేకపోతే ఆ ప్రభావం ఎపి ఎన్నికలపైనా పడే ప్రమాదం పొంచి వుంది. దానికి తోడు పార్టీలో లోకేష్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే కొందరు సీనియర్లు కాంగ్రెస్ తో పొత్తును బూచిగా చూపించి ముసలం పుట్టిస్తారా అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నిర్మితమైన టిడిపిని ఆ పార్టీతో దోస్తీతో చంద్రబాబు ద్రోహం చేశారన్న ప్రచారం తో సీనియర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు హస్తం కి చెయ్యి అందివ్వాలా లేక నో చెప్పేయాలో తెలియని అనిశ్చితిని కెసిఆర్ అనుకోకుండానే సృష్టించారు. మరి బాబు తెలంగాణాలో ఎలాంటి ముందడుగు వేస్తారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*