నారా…హమారా…అంటూ చెప్పేస్తారా?

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మైనారిటీ మంత్రి పేరును ప్రకటిస్తారా? గుంటూరులో నేడు జరిగే ‘‘ నారా హమారా-టీడీపీ హమారా’ మైనారిటీ సదస్సులో మంత్రి ఎవరో చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నారా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మైనారిటీలకు, ఎస్టీలకు చోటు లేకుండా పోయింది. అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మైనారిటీలకు మరింత దగ్గరవ్వాలని యోచిస్తున్న చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగిన ముహూర్తం ఇంకా ఖరారు కాకపోవడంతో మైనారిటీ సదస్సులో మంత్రి ఎవరో చంద్రబాబు ప్రకటిస్తారని తెలుగుదేశం పార్టీ మైనారిటీ వర్గాలు భావిస్తున్నాయి.

అసెంబ్లీ సమావేశాల లోపే….

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల ఆరో తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈలోపే మంత్రి వర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులోభాగంగా మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఒక్క మైనారిటీ వర్గం నుంచే మంత్రి వర్గంలో స్థానం ఉంటుందా? ఎస్టీ కేటగిరీ నుంచి కూడా మంత్రి వర్గంలో చోటు ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం మైనారిటీ వర్గానికి చెందిన వారిని మాత్రం నియమించాలని, ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

నేడు జరిగే సదస్సులో…..

దీంతో ఈరోజు గుంటూరులో జరిగే నారా హమారా-టీడీపీ హమారా మైనారిటీ సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి షరీఫ్ ను తీసుకోవాలని చంద్రబాబు దాదాపుగా డిసైడయ్యారంటున్నారు. సదస్సులో షరీఫ్ పేరునే అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి పదవికోసం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన జలీల్ ఖాన్, చాంద్ భాషాలు ఆశిస్తున్నారు. అయితే వీరికి ఇచ్చే అవకాశాలు లేవు. టీడీపీలో మరో సీనియర్ నేత ఎన్ఎండీ ఫరూక్ పేరు విన్పించినా ఆయన ఇప్పటికే శాసనసమండలి ఛైర్మన్ గా ఉండటంతో షరీఫ్ కే దాదాపు మంత్రి పదవి ఖరారు అయిందంటున్నారు.

షరీఫ్ కే అవకాశాలు…..

షరీఫ్ విషయానికొస్తే ఆయన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేత. ఆయన పార్టీలో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉండటంతో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా షరీఫ్ అంకిత భావంతో పనిచేస్తారన్న పేరుంది. రాయలసీమలోనే ఎక్కువగా ముస్లిం ఓటర్లు ఉండటంతో తొలుత ఎన్ఎండీ ఫరూక్ కు ఇవ్వాలని నిర్ణయించారు. కాని చివరి నిమిషంలో షరీఫ్ కే చంద్రబాబు ఓటేసినట్లు సమాచారం. రెండు కీలక పదవులు మైనారిటీలకు ఇచ్చినట్లవుతుందన్నది బాబుభావన. కానీ ఇప్పుడు మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారంచేసినా పదవిలో ఉండేది నెలలు మాత్రమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*