సైకిల్ సవారీ సులువు కాదని తెలిసి….?

టీడీపీ నేతల బుజ్జగింపులు పనిచేయడం లేదు. అధినేత హామీలను కూడా నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల పెంపుదల లేకపోవడంతో టిక్కెట్లు తమకు రావని నిర్ణయించుకున్న తమ్ముళ్లు తన దారిన తాను చూసుకుంటున్నారు. ఇది చంద్రబాబుకు కొద్దిగా ఆందోళన కల్గించే విషయమే. అందుకే ఆయన తిరుపతి సభలో సయితం పైసా ఖర్చులేని నియోజకవర్గాల పెంపును కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని, నియోజకవర్గాలు పెరిగితే టీడీపీ బలం పెరుగుతుందని బీజేపీ పెంచడం లేదని ఆయన ధర్మపోరాట సభ సాక్షిగా ప్రకటించడం విశేషం.

వచ్చిన వారిని వచ్చినట్లు…..

నియోజకవర్గాలు పెరుగుతాయని పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. రాజకీయ పునరేకీకరణ జరగాలని, అభివృద్ధికి రాజకీయాల కారణంగా ఆటంకం ఉండకూడదని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే చేరికలకు పచ్చ జెండా ఊపారు. తనపై ఉన్న నమ్మకం, అభివృద్ధి చూసే నేతలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారని చెప్తూ వచ్చారు. నేతలు కూడా అధికారంలో ఉంది కదా? అని వచ్చేశారు. ఇప్పుడు సైకిల్ ఫుల్ లోడ్ అయింది.

పునర్విభజన లేదని తేలడంతో…..

అయితే నియోజకవర్గాల పునర్విభజన జరగదని తేలడం, వచ్చే ఎన్నికల్లో తమకు సైకిల్ పార్టీ నుంచి టిక్కెట్ రావడం కష్టమేనని భావించిన తెలుగు తమ్ముళ్లు తమ దారి తాము చూసుకుంటున్నారు. తమకు అధినేత చంద్రబాబు నుంచి ఏదైనా హామీ వస్తుందేమోనని తొలుత పార్టీ మారుతున్నట్లు కొందరు ఫిల్లర్లు కూడా వదిలారు. అయితే వారిని పిలిపించుకుని బుజ్జగించిన చంద్రబాబు టిక్కెట్ విషయంలో మాత్రం హామీ ఇవ్వలేదు. ఫైనల్ గా నేతలకు టిక్కెట్టే ప్రాధాన్యత కావడంతో ప్రతిపక్ష పార్టీలోకి జంప్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

నచ్చ జెప్పినా…సముదాయించినా…

తొలుత విజయవాడకు చెందిన టీడీపీ నేత యలమంచిలి రవికి చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మంచి పదవి దక్కుతుందని హామీ ఇచ్చారు తప్పించి, టిక్కెట్ విషయంలో బాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు.ద దీంతో ఆయన ఫ్యాన్ పార్టీవైపు పరుగులు తీశారు. మరో టీడీపీ నేత వసంతకృష్ణ ప్రసాద్ ను కూడా గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సముదాయించారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో టిక్కెట్ ఇస్తామని వసంతకు హామీ ఇచ్చి ఇవ్వలేదు. అయితే ఈసారి వసంత తప్పు చేయదలచుకోలేదు. ఫ్యాన్ పార్టీ మైలవరం టిక్కెట్ ఇస్తామని ప్రామిస్ చేయడంతో ఆయన జగన్ సమక్షంలో కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. ఇలా సైకిల్ సవారీ కష్టమని తెలిసిన నేతలు ఒక్కొక్కరూ జారుకుంటుండటం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు చేరికలతో వైసీపీలో సందడి నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*