బాబు మనసు దోచిన ఆ ముగ్గురు….!

వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అప్పుడే కసరత్తులు ప్రారంభించేశారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారు జనాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునేందుకు వీలుగా ప్లాన్‌ చేస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు అంటేనే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్ర‌క‌ట‌న‌కు వాళ్ల‌కు భీఫామ్‌ ఇవ్వడానికి ముందు వరకు తటపటాయిస్తారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్లాన్‌ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వికటించి పార్టీ గత మూడు, నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోతూ వస్తుంది.

బలహీనంగా ఉన్నచోట…….

దీనికి చెక్‌ పెట్టే క్రమంలోనే చంద్రబాబు పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల, విపక్ష పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట్ల తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించనున్నారు. ఇక ఏపీలోని 175 నియోజకవర్గాల్లోను మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కూడా చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇప్ప‌టికే త‌న క‌స‌ర‌త్తులు ప్రారంభించేశారు. శ్రీకాకుళం జాల్లా రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళీకి పార్టీ పగ్గాలు అప్పగించిన చంద్రబాబు పాలకొండలోనూ పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన కలమట వెంకటర‌మ‌ణ‌ను కాదని ఆ స్థానంలో మరో బలమైన అభ్యర్థికి పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన సొంత జిల్లా చిత్తూరులో విపక్ష వైసీపీకి దూకుడు వేసేందుకు చంద్రబాబు ముందే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించేశారు.

మూడు నియోజకవర్గాల్లో…..

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థిత్వాలు దాదాపు ఖ‌రారు చేసేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో పార్టీ గత నాలుగు ఎన్నికల్లోనూ వరసగా ఓడిపోతూ వస్తోంది. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో గెలవడం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, సీఎంగా ఆయన ప్రతిష్ఠకు సవాల్‌గా మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానికి చంద్రబాబు చంద్రగిరి బాధ్యతలు అప్పగించారు.

టిక్కెట్లు ఖరారు చేసి……

ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో అనూషా రెడ్డి పేరు దాదాపు ఖ‌రారు అయ్యినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తానని పోటీకి రెడీగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని చంద్రబాబు అనూషా రెడ్డికి సూచించారని సమాచారం. ఇక పీలేరులో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్నారు. చంద్రబాబు ఆయనతో కూడా ఎలాగైనా పీలేరులో ఈ సారి టీడీపీ గెలవాలని అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రెడీ చేసుకుని… జనాల్లోకి వెళ్లాలని సూచించారు. కిషోర్ ఇప్ప‌టికే నాలుగైదు నెల‌లుగా పీలేరులో గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు క్రమక్రమంగా ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల పేర్లను ఖ‌రారు చేసుకుంటూ ఎన్నికల కసరత్తు ప్రారంభించేశారని స్పష్టం అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*