ముసుగులో… బాబు రాజకీయం…!

ముసుగు రాజకీయం తెలంగాణలో ప్రధానపార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలే అంతర్గత విభేదాలతో అతలాకుతలమవుతున్న కాంగ్రెసు పార్టీకి టీడీపీ పన్నుతున్న ఎత్తుగడలు, కోదండరామ్ వ్యూహాలు అంతుచిక్కడం లేదు. అధికారపార్టీతో పోరాటానికి అన్నిపార్టీలను కలుపుకుని పోవాలని చూస్తున్నప్పటికీ కలిసి రావడం లేదు. ఎదుటిపార్టీపై పైచేయి సాధించేందుకు బెట్టు చేస్తున్నాయి. తమ బలాన్ని వాస్తవాన్ని మించి ప్రదర్శించాలని చూస్తున్నాయి. మహాకూటమి కట్టాలని తద్వారా టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని శతవిధాలా హస్తం పార్టీ చేస్తున్న యత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. రాజకీయ విన్యాసాల్లో కేసీఆర్ ను టార్గెట్ చేయాలన్న ఉమ్మడి లక్ష్యం నీరుగారిపోతోంది. పంతాలు, పట్టింపులు తొంగిచూస్తున్నాయి. ఏదో రకంగా చేతులు కలపాలనుకుంటున్న సమైక్య లక్ష్యానికి గండి కొట్టే ప్రమాదం కనిపిస్తోంది.

కోదండం అస్త్రంగా…

తెలంగాణ సమాజంలో గౌరవమర్యాదలు పొందిన వ్యక్తి కోదండరామ్. రాష్ట్రసాధన ఉద్యమం ఆయనకు గౌరవప్రతిపత్తిని సాధించిపెట్టింది. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపడతానంటే ఆ మన్నన సరిపోదు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే అంగబలం, అర్థబలం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పైపెచ్చు ఉద్యమ కాలం నాటి సెంటిమెంటు ప్రస్తుతం ఏమాత్రం పనిచేయదు. రాష్ట్రాన్ని తామే సాధించినట్లు బోర విరిచి మరీ ప్రకటిస్తున్న టీఆర్ఎస్ సైతం ఈసారి సెంటిమెంటును నమ్ముకోవాలనుకోవడం లేదు. రాష్ట్రసాధన అంశం ఒక పరిమితమైన పరిధికే పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజలకు ఏమి చేస్తున్నాం? భవిష్యత్తులో ఏమి చేయబోతున్నామన్నదే ముఖ్యం. దానిని దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అజెండాతోనే టీఆర్ఎస్ బరిలో నిలుస్తోంది. కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణ జనసమితి బరిలో నిలవాలని చూస్తోంది. నిర్దిష్టమైన అజెండా లేకుండా కేసీఆర్ వ్యతిరేకతనే అస్త్రంగా ఎన్నికలకు వెళితే పెద్దగా ప్రయోజనం ఉండదు. పైపెచ్చు తెలుగుదేశం పార్టీ కోదండరామ్ ను అడ్డుగా పెట్టి తాము అధికసీట్లు సాధించాలనే వ్యూహంతో ముందుకు కదులుతున్నట్లు సమాచారం.

అత్యాశ..అతి విశ్వాసం….

టీడీపీ పూర్తిగా కోదండరామ్ ను భుజానికి ఎత్తుకొంటోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రతిపాదించి ముందుకు వెళితే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెసు పార్టీ ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండు ఉంచారు. అలా జరిగితే తాము పొత్తు కుదుర్చుకోవడానికి సులభంగా ఉంటుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెసు ఈ ప్రతిపాదనను చూసి నోరు వెళ్లబెడుతోంది. నిజానికి తెలంగాణ జనసమితి సొంతంగా పోటీ చేస్తే ఒక్కసీటు కూడా గెలిచే బలం లేదు. టీడీపీ ఒక పది నుంచి పన్నెండు సీట్లలో డిపాజిట్టు దక్కవచ్చు. రెండు మూడు సీట్లు గెలిచే సత్తా ఉంది. టీఆర్ఎస్ ను ఢీకొనగలిగిన పెద్దపార్టీగా ఉన్న కాంగ్రెసును ముఖ్యమంత్రి పోటీ నుంచి తప్పించాలని చూడటం ఆశ్చర్యమే. అంతేకాకుండా తెలంగాణ జనసమితి కనీసం తమకు 30 సీట్లు ఇవ్వాలని డిమాండు చేస్తోంది. 5 సీట్లకు మించి ఆ పార్టీకి ఇస్తే చేజేతులారా అధికారాన్ని పోగొట్టుకున్నట్లే నని కాంగ్రెసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలోనూ వెయ్యి ఓట్లకు మించి టీజేఎస్ సాధించే సత్తా లేదనేది కాంగ్రెసు అంతర్గత అంచనా. అయితే పొత్తు కుదిరితే కూటమికి నైతిక స్థైర్యం ఏర్పడుతుంది. తద్వారా అదనపు బలం చేకూరుతుంది. ఆ దృష్టితోనే కాంగ్రెసు చేయి కలపాలని చూస్తోంది. దానిని బలహీనతగా భావిస్తూ టీడీపీ, కోదండరామ్ పార్టీలు ఆచరణ సాధ్యం కాని డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి.

కాంగ్రెసులో కుంపటి..

కాంగ్రెసు పార్టీలో కమిటీల కుంపటి కొనసాగుతోంది. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన హనుమంతరావు వంటివారు సైతం ఆగ్రహంతో, అసంతృప్తితో రగిలిపోతున్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడిన కోమటిరెడ్డి సోదరులు ఎన్నికలకు సంబంధించిన కమిటీల్లో తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో నేరుగా సమావేశమయ్యే అవకాశం వారికి లభించింది. దీంతో ఈ సోదరులకు ఏదో ఒక కీలక పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఏదో నామమాత్రపు పదవితో ఒట్టిచేతులే మిగిలాయి. దాంతో రగిలిపోయిన రాజగోపాల్ రెడ్డి పార్టీని తీవ్రంగా విమర్శించారు. షోకాజ్ నోటీసు అందుకోవాల్సి వచ్చింది. మొత్తమ్మీద గ్రూపులకు తోడు పార్టీలో పరిస్థితులు ఏ మాత్రం సజావుగా లేవనేందుకు ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*