చంద్రబాబు రైట్ హ్యాండ్‌కు ఆ సీటు…?

తెలంగాణలో పున‌ర్ వైభవం కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో మహాకూటమి పేరుతో తన బద్ద శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అయిపోయింది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహాజనసమితి కూటమి జట్టు కట్టడం ఖ‌రారు అయినా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అన్న లెక్క ఒక్కటే తేలాల్సి ఉంది. దీనిపై అన్ని పార్టీలు ఇప్పటికే ప్రాథ‌మికంగా ఓ నిర్ణయానికి వచ్చేశాయి. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌కు కూటమిలో ఉన్న మిగిలిన మూడు పార్టీలు తాము ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామో, ఏఏ సీట్లు అడగాలని అనుకుంటున్నామో అన్న దానిపై ఓ లిస్ట్‌ కూడా ఇచ్చేశాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం మొత్తం 19 స్థానాల్లో తమ పార్టీ తర‌పున పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను కాంగ్రెస్‌కు సమర్పించింది.

19 నియోజకవర్గాలకు……

ఈ 19 నియోజకవర్గాల్లో కనీసం 15 సీట్లకు తగ్గకుండా టీడీపీ పోటీ చేసే ఛాన్స్‌ ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఇక్కడ 15 సీట్లలో గెలిచింది. దీంతో టీడీపీకి కాంగ్రెస్ కూడా 15 సీట్లకు త‌గ్గకుండా ఇవ్వనుంది. ఈ క్రమంలోనే పార్టీలో ఎప్పటి నుంచో ఉండి పార్టీ కోసం ఇప్పటికీ ఎన్ని ఛాన్సులు వచ్చినా పార్టీని వీడ‌కుండా అంకిత భావంతో ఉన్న వారందరికీ దాదాపు సీట్లు ఖ‌రారు చెయ్యనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ ఇప్పటికీ సంస్థాగతంగా బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావుకు అసెంబ్లీ సీటు ఖాయం చేసినట్టు తెలుస్తోంది. 2009లో రేణుకా చౌదరిపై భారీ మెజార్టీతో ఎంపీగా ఘ‌న‌విజయం సాధించిన నామా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేతిలో కేవలం 10వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఖమ్మం అసెంబ్లీ నుంచి……

ఎన్నికల్లో ఓటమి తర్వాత నామా బీజేపీలోకి వెళ్తారని… కాంగ్రెస్‌లోకి వెళ్తారని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఎంతో నమ్మిన రేవంత్‌ రెడ్డి లాంటి వాళ్లు సైతం పార్టీలు మారినా నామా మత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యం, అసెంబ్లీ ఎన్నికలు ముందుగా వస్తుండడంతో నామాను ఖమ్మం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దింపనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొత్తులో భాగంగా టీడీపీ తమ సిట్టింగ్‌ స్థానమైన సత్తుపల్లితో పాటు ఖమ్మం సీటును కూడా కోరుకోనుంది. ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి నామా పోటీ చెయ్యనున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ముందుగా రావ‌డంతో ఆయ‌న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. టీడీపీ ఇప్పటికే కాంగ్రెస్‌కు సమర్పించిన ప్రాబ‌బుల్స్‌ లిస్ట్‌లో సైతం నామా పేరు ఉంది.అయితే ఇదే ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ తమ సిట్టింగ్‌ స్థానమైన సత్తుపల్లితో పాటు ఖమ్మం, కొత్తగూడెం సీట్లను కూడా అడగాలని ముందుగా భావించింది.

కోనేరుకు లేనట్లేనా?

కొత్తగూడెం నుంచి మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని పొత్తులో భాగంగా తాను టీడీపీ నుంచి పోటీ చెయ్యాలని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయన చంద్రబాబును కలిసి తమ అభ్యర్థన కూడా విన్నవించారు. అయితే టీడీపీ, కాంగ్రెస్‌కు ఇచ్చిన ప్రాబ‌బుల్స్‌ లిస్ట్‌లో కేవలం సత్తుపల్లి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేర్లు మాత్రమే ఉండడంతో కొత్తగుడెంలో కోనేరు ఆశలు నెరవేరనట్టే. ఏదేమైనా చంద్రబాబును నమ్ముకున్నందుకు నామాకు ఖమ్మం అసెంబ్లీ సీటు దక్కడం అయితే ఖాయం అయినట్టే. ఇక నామా అసెంబ్లీకి పోటీ చేస్తే అక్కడ ఆయనకు కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సైతం అసెంబ్లీకే పోటీ చేస్తారా లేదా ? వచ్చే ఎన్నికల్లో ఆమె ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగుతారా అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*