షాక్‌.. టీ-టీడీపీ ఖాళీ అవుతోందిగా..!

అవును! టీడీపీ నాయ‌కుల‌కు ఒకింత బాధ క‌లిగినా.. ఇది వాస్త‌వం అంటున్నారు తెలంగాణ రాజ‌కీయ విశ్లేష‌కులు. ఏపీ, తెలంగాణ‌ల్లో పార్టీని విస్త‌రించేందుకు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ఎలాంటి ప్ర‌య‌త్నాలూ ముందుకు సాగ‌క‌పోగా.. ఇప్పుడు పార్టీ ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. గ‌తంలో పార్టీలో ఉండి, చంద్ర‌బాబు కు రైట్ హ్యాండ్‌గా వ్య‌వ‌హ‌రించిన నాయ‌కులే, ప‌లు కీల‌క ప‌ద‌వులను వెల‌గ‌బెట్టిన నేత‌లే ఇప్పుడు తెలంగాణ‌లో టీడీపీకి శ‌త్రువులుగా మారార‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ టీడీపీని వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో కుదిరితే అధికారం లోకి తేవాల‌ని అధినేత చంద్ర‌బాబు ప‌క్కా వ్యూహం వేశారు. ఈ క్ర‌మంలోనే నాయ‌కుల‌కు వివిధ ప‌ద‌వులు ఇచ్చి.. స్వేచ్ఛ‌ను సైతం ప్ర‌సాదించారు.

తమ దారి తాము చూసుకున్న……

అయితే, బాబు ఇచ్చిన స్వేచ్ఛ‌తో ఎదిగిన కొంద‌రు నాయ‌కులు త‌మ దారి తాము చూసుకున్నారు. వీరిలో ప్ర‌ధానంగా కొడంగ‌ల్ ఎమ్మెల్యే(రాజీనామా చేశారు.. అయినా ఆమోదం పొంద‌లేదు) రేవంత్ రెడ్డి, టీడీపీ ప‌క్ష నేత ఎర్ర‌బెల్లి దయా క‌ర్‌లు. ఎర్ర‌బెల్లి త‌ర్వాత కాలంలో నేరుగా వెళ్లి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, రేవంత్.. నేరుగా కాంగ్రెస్ జెండా క‌ప్పుకొన్నాడు. వీరిద్ద‌రూ బయటకు వెళ్లడంతో పార్టీ తీవ్రంగా దెబ్బ‌తింది. అయినా కూడా పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ మాత్రం పార్టీని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. మ‌రో పది రోజుల్లో మ‌హానాడు కూడా జర‌గ‌నుంది. ఈ స‌భ వేదిక‌గా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టేందుకు టీడీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నేత‌ల‌ను కూడ‌దీస్తున్నారు.

ఎర్రబెల్లి మేనల్లుడు….

అయితే, వీరికి పాజిటివ్ వేవ్స్ క‌న్నా నెగిటివ్ వేవ్స్ ఎక్కువ‌గా ఎదుర‌వుతున్నాయి. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డం, నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా జంప్ అవుతుండ‌డంతో అసలు ఎన్నిక‌ల స‌మ‌యానికి తెలంగాణ‌లో టీడీపీ టికెట్ ఇస్తామ‌న్నా బ‌రిలో నిల‌బ‌డే నేత‌లు క‌రువవుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు మదన్‌మోహన్‌ రావు తాజాగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో ఉండ‌డంతో ఆయ‌న అనుచ‌రులుగా ఉన్న చాలా మంది టీడీ పీ నేత‌లు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. అదేవిధంగా ప్ర‌స్తుతం గ‌జ్వేలు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి కూడా త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని స‌మాచారం.

గత ఎన్నికల్లో టీడీపీ తరుపున…..

వీరిద్ద‌రు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అల్లుడు అయిన మ‌ద‌న్‌మోహ‌న్‌రావు జ‌హీరాబాద్ ఎంపీగా పోటీ చేసి చెప్పుకోద‌గ్గ రీతిలోనే ఓటింగ్ సాధించారు. ఇక గ‌జ్వేల్ టీడీపీ ఇన్‌చార్జ్ ప్ర‌తాప‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థిగా పోటీ చేసిన కేసీఆర్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఒకానొక ద‌శ‌లో కేసీఆర్ ఆయ‌న చేతుల్లో ఓడిపోతార‌న్న టాక్ కూడా వ‌చ్చింది. అంత క్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా గ‌జ్వేల్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ మెజార్టీ సీట్లు ద‌క్కించుకుంది. ఇప్పుడు వీరిద్ద‌రు కూడా టీడీపీకి దూర‌మై కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారంటే తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల టైంకు ఎలా ఉంటుందో ఊహించ‌డానికే క‌ష్టంగా ఉంది.

గైర్హాజరైన నేతల మాటేంటి?

అదేవిధంగా తెలంగాణ టీడీపీలో మిగిలి ఉన్న కొద్దిమంది నేత‌లు కూడా పార్టీని వీడతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోప‌క్క‌, ఇటీవ‌ల పార్టీ అధినేత చంద్ర‌బాబు టీ-టీడీపీ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశానికి ఇద్ద‌రు నేత‌లు హాజ‌రుకాలేదు. వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఈ స‌మావేశానికి రాలేదు. ఇప్ప‌టికే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మోత్కుప‌ల్లి పార్టీని వీడుతార‌నే టాక్ వినిపిస్తోంది. పెద్దిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పెద్ద ఎత్తున టీడీపీ నుంచి వ‌ల‌స‌లు ఉండే ఛాన్స్ క‌నిపిస్తోంది. దీంతో టీ టీడీపీ ఇక తాళం వేయ‌డ‌మే బెట‌ర్ అని అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*