
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కృత నిశ్చయంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా వేస్తున్న అడుగులు కొత్త రాజకీయాలకు తెరదీస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయం అనగానే ఇప్పటికే పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు, సీనియర్లు, సిఫారసు నేతలు ఎంతో మంది టికెట్ల కోసం వేచి ఉంటారు. ఉన్నది 175 స్థానాలే అయినా వేల సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమం లోనే చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారు.
పార్టీలో చేరతారనుకురే వారికోసం….
ఈ విషయాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే, పార్టీ వీక్‌గా ఉండి.. అక్కడ అభ్యర్థుల పలుకుబడితోనే విజయం సాధించగలం అనుకున్న నియోజకవర్గాల్లో మాత్రం చంద్రబాబు.. తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. కొన్ని ఎంపీ, ఎమ్మెల్యేస్థానాల్లోనూ ఆయన సిట్టింగులు లేదా పార్టీలోని ఆశావహులకు కాకుండా త్వరలోనే పార్టీలో చేరతారు.. అని వినిపిస్తున్న నాయకులకు రిజర్వ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది వీటిలో కీలకమైన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఉండడం గమనార్హం. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజకు అవకాశం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సీటుకు ఎవరినీ ఇప్పటికీ ఖరారు చేయలేదు. అయితే, దీనికి ఇంకా పార్టీలోకి చేరని, చేరతారని భావిస్తున్న కొణతాల రామకృష్ణ, లేదా మాజీ ఎంపీ సబ్బం హరిలపై బాబు ఆశలు పెట్టుకున్నారు.
బొమ్మిరెడ్డి కోసం…..
అదేవిధంగా నెల్లూరులో వైసీపీ నుంచి బయటకు వచ్చి.. జగన్‌ను తిట్టిపోసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిపైనా చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఇంకా సైకిల్ ఎక్కలేదు. కానీ, ఆయనను పార్టీలో చేర్చుకుని వెంకటగిరి నియోజకవర్గం అప్పగించాలని భావిస్తున్నారట. అదేవిధంగా పార్టీలోకి వస్తే.. కనుక ఉండవల్లి అరుణ్ కుమార్‌కు కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారని సమాచారం. ఇక, జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. కడప ఎంపీ సీటు విషయంలో చంద్రబాబు నాయుడు మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని పరిగణనలోకి తీసుకుంటున్నాడట. డీఎల్ వస్తే కడప ఎంపీ టికెట్ ఇచ్చేస్తామని చెబుతున్నారట.
కిరణ్ కు ఆ సీటు రిజర్వ్ చేసి…..
అదేవిధంగా కడప జిల్లాలోనే రాజంపేట ఎంపీ స్థానం విషయమూ ఇలానే ఉంది. కాంగ్రెస్ తో పొత్తు నేపథ్యంలో ఈ సీటును కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇచ్చేయడానికి టీడీపీ రెడీ అయిపోయిందని తెలుస్తోంది. ఇక అరకు ఎంపీ సీటును ఇంకా పార్టీలోకి చేరని ఒక ఐఏఎస్ కోసం రిజర్వ్ చేశారట. ఆయన రాగానే బాధ్యతలను ఇస్తారని సమాచారం. నెల్లూరు ఎంపీ సీటు విషయంలో కూడా ఎవరైనా వస్తారా? అనే ఆశలతోనే చూస్తున్నారట. ఇప్పుడు ఉన్న నేతల్లో నెల్లూరు ఎంపీగా పోటీచేసి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. ఆదాలను బాధ్యతలు తీసుకొమ్మంటుంటే ఆయన సోమిరెడ్డికి అప్పగించండి అంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక కైకలూరులో పార్టీలో చేరకుండానే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు సైతం అసెంబ్లీ సీటు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన స్థానిక టీడీపీ కేడర్ గగ్గోలు పెడుతోంది. దీంతో.. ఎవరైనా చేరే నేతకు ఈ సీటునివ్వడానికి సై అంటున్నారని…. ఈ క్రమంలో పాతవారిని పట్టించుకునే పరిస్థితి లేదని సమాచారం. మొత్తానికి టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
Leave a Reply