అంతం కాదిది….ఆరంభం మాత్రమే

కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రాబాబు చెప్పారు. 2014లో ఇదే రోజు తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో మోడీ ఇచ్చిన హామీలను అమలుపర్చలేదని కోరుతూ ధర్మపోరాట సభను నిర్వహించారు. ఇక్కడి నుంచే కేంద్రంపై పోరాటం మొదలయిందని చంద్రబాబు చెప్పారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమే నన్నారు. తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభలో చంద్రబాబు ప్రసంగించారు. వెంకన్న సాక్షిగా చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ మాట తప్పారన్నారు. బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేయడానికి సహకరిస్తానని చెప్పిన మోడీ, కేవలం రాజధానికి 1500 కోట్లుమాత్రమే ఇచ్చారన్నారు. నాలుగేళ్లు నా కష్టార్జితంతోనే రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డానన్నారు. హేతుబద్ధత లేని విభజన చేసి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. పద్ధతి లేని విభజన చేసి అన్యాయం చేశారన్నారు. పార్లమెంటులో చేసిన చట్టాలకే దిక్కేలేదంటే ఎవరితో చెప్పుకోవాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 29 సార్లు ఢిల్లీకి వెళితే తనకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనంటేనే తెలంగాణాలో ఉన్న ఏడు పోలవరం ముంపు మండలాలను ఇచ్చారన్నారు. ఆ తర్వాత సహకరించలేదన్నారు. తర్వాత ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి జీవో కూడా ఇవ్వలేదన్నారు.

నలభై ఏళ్ల రాజకీయ జీవితం….

నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ప్రారంభించానన్నారు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏపుట్టనడిగినా, చెట్టునడిగినా తన కధేంటో చెబుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వకుండా పది రాష్ట్రాలకు ఇచ్చారన్నారు. ఏపీకి ఎందుకివ్వరోచెప్పాలన్నారు. ప్రత్యేక హోదాపై రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. పరిశ్రమలకు రాయితీలు కూడా ఇవ్వలేదన్నారు. లోటు బడ్జెట్ పదహారు వేల కోట్లుంటే…నాలుగువేల కో్ట్లు ఇచ్చి పనైపోయిందనే పరిస్థితికి వచ్చారన్నారు. పోలవరం కోసమే ఇన్నాళ్లూ ఓపికపట్టానన్నారు. పోలవరం అందరి ఆశీస్సులతో పూర్తి చేస్తానన్నారు. కొందరు కావాలని ఆరోపణలు చేసి ప్రాజెక్టుకు అడ్డంపడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. హైదరాబాద్ లో మూడో నగరమైన సైబరాబాద్ ను తానే నిర్మించానని చెప్పారు. గుజరాత్ లో ఉన్న నగరాలున్నాయని, ఏపీకి నగరం అవసరం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక క్యారిడార్ కు కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ను కూడా ఇవ్వడం లేదన్నారు. ఇది నమ్మకం ద్రోహంకాదా? అని ప్రశ్నించారు. వైసీపీ, బీజేపీ లాలూచీ రాజకీయాలకు పాల్పడతున్నాయన్నారు. తనను దెబ్బతీయడానికే వైసీపీతో బీజేపీ చేతులు కలిపిందన్నారు. అసెంబ్లీ సీట్లను కూడా పెంచలేదన్నారు. సీట్లు పెంచితే టీడీపీ బలపడుతుందనే నియోజకవర్గాల సంఖ్యను పెంచడం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రస్ తో జతకట్టి రాష్ట్ర విభజనకు కారణమయిందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*