“మర్యాద” చంద్రన్న మంటగలిపారా…?

nara chandrababu naidu vs narendramodi

మర్యాదలు మంటగలిసి పోతున్నాయి. సంప్రదాయాలు చట్టుబండలైపోతున్నాయి. రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను అపహాస్యం పాలు చేస్తున్నారు. ముఖ్యంగా భారత రాజకీయవేత్తలు తమ పరిధులు, పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారు. తమ స్థాయిని సైతం మరిచిపోతున్నారు. ఇప్పుడు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల సంబంధాలు పక్కా రాజకీయాలపై ఆధారపడి నడుస్తున్నాయి. అందులోనూ ఈ ఎన్నికల కాలంలో ఇదో పెద్ద అనుసరణీయ మార్గంగా మారిపోయింది. నాయకులు చూపుతున్న బాటను కోట్ల సంఖ్యలోని కార్యకర్తలు, చోటామోటా నాయకులు అనుసరించడంతో అరాచకానికి బాటలు పడుతున్నాయి. దేశ సమాఖ్య వ్యవస్థకే కాదు, దేశ సమగ్రతకే భంగం వాటిల్లుతోంది. ఉత్తరాది మొదలు దక్షిణభారతం వరకూ ఇదే పోకడ పొడచూపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని పర్యటనను బహిష్కరించండంటూ ప్రభుత్వాధినేత ఇచ్చిన పిలుపు ఒక చెడు సంకేతానికి , సంప్రదాయానికి నాంది పలికినట్లే. రాజకీయ సమావేశాలకు దూరంగా ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాలను బహిష్కరించాలనుకోవడం సమాఖ్య సిద్దాంతాన్ని అవమానించడమే.

పెద్దరికం పోయింది…

గతంలో అధికార,విపక్షాల మధ్య కనీస గౌరవమర్యాదలు ఉంటుండేవి. ప్రత్యర్థి అయినప్పటికీ మంచి చేసినప్పుడు ప్రశంసించే లక్షణం ఉండేది. వాజపేయి నాయకత్వాన్ని గుర్తించి భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశం ఈ కుర్రాడికి ఉందని నెహ్రూ ప్రశంసలు కురిపించారు. ఇందిర ప్రధానిగా పాకిస్తాన్ పై విరుచుకుపడినప్పుడు అపరకాళిగా అభివర్ణించి వాజపేయి అండగా నిలిచారు. ఇవన్నీ తమ భవిష్యత్ అవకాశాల గురించి ఆలోచించుకుని మాట్టాడినవి కాదు. దేశం బాగుండాలి. దేశానికి మంచి జరగాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయా నాయకులు తమ ప్రవర్తనను మలచుకునేవారు. నేటి రాజకీయాల్లో అది దుస్సాధ్యం. భవిష్యత్తులో తమకు , వారసులకు ఇబ్బంది ఎదురవుతుందని తెలిస్తే తమ పార్టీకి చెందినవారినే తుంచిపారేస్తున్నారు. ప్రత్యర్థులను రాజకీయాల్లో శత్రువులుగా చూస్తున్నారు. మమత, చంద్రబాబు వంటివారు అనుసరిస్తున్న వైఖరి సమాఖ్య సంక్షోభానికి దారి తీస్తుందేమోననే పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా విభేదించడం తప్పుకాదు. కానీ ప్రొటోకాల్ మర్యాదలు, కేంద్ర,రాస్ట్ర రాజ్యాంగబద్ధ ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన కనీస సంబంధాలకు నీళ్లొదిలేయడం ఏమాత్రం మంచిదికాదంటున్నారు. అందులోనూ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వారు, ఉన్నతపదవులను అధిష్ఠించిన వారే దారి తప్పడం రాష్ట్రాల ప్రయోజనాలకు కూడా మంచిదికాదంటున్నారు.

ఫక్తు అవకాశవాదం…

నరేంద్రమోడీ వంటి ప్రధానిని దేశ చరిత్రలో ఇంతవరకూ చూడలేదని ప్రశంసలు కురిపించిన ఘనత చంద్రబాబుదే. నిజానికి నరేంద్రమోడీ రాజకీయ ప్రధాని. రాజనీతిజ్ణుడైన ప్రధాని కాదు. 2002లో అసలు ముఖ్యమంత్రిగానే పనికిరాడు. ఆయనను తొలగించడంటూ డిమాండు చేసిన చంద్రబాబు నాయుడు 2014 వచ్చేసరికి ఆయననే తలపైకి ఎత్తుకున్నారు. 2017లో మళ్లీ ఆయననే విసిరికొట్టారు. నిజానికి మోడీ పెద్దగా మారిందేమీ లేదు. జాతీయ వాదం, హిందూ భావనలతో బీజేపీకి రాజకీయాధికారాన్ని సుస్థిరం చేయడమే ఆయన మిషన్ లక్ష్యం. అది సాధించే క్రమంలో భాగంగానే తెలుగుదేశంతో మైత్రి. అయితే టీడీపీ అధినేతకు అదికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యం అందుకే మోడీని అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న పరిమితుల ద్రుష్ట్యా అభివ్రుద్ధిని పరుగులు తీయించడం అంత త్వరగా సాధ్యం కాదు. కానీ ఈలోపుగానే అయిదేళ్ల కాలం గడిచిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీని అధికారానికి దూరం చేస్తుందన్న భయం పట్టుకుంది. దీంతో కేంద్రంలోని బీజేపీ వైపునకు నెట్టే క్రమంలోనే వ్యూహాత్మకంగా మోడీని టార్గెట్ చేస్తూ టీడీపీ దూరం జరిగింది. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండానే ఎవరికైనా ఈవిషయం ఇట్టే అర్థమైపోతుంది. ప్రజల్లో బీజేపీ వ్యతిరేకతను టీడీపీ బాగానే నాటగలిగింది. అయితే ఫలితమొస్తుందా? లేదా? అంటే చెప్పలేకపోతున్నారు. అతిశయోక్తులతో ప్రధానిని గతంలో అక్కున చేర్చుకోవడమే దీనికి ప్రధాన కారణం.

గెలుపే సర్వస్వం..

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మిత్రపక్షాలు, శత్రుపక్షాలన్న భేదం గెలుపు అవకాశాలపైనే ఆధారపడి ఉంది. మమత బెనర్జీ కూడా మోడీకి స్వతహాగా శత్రువు కాదు. కానీ పశ్చిమబంగలో మోడీ, అమిత్ షాల నేత్రుత్వంలో ఆ రాష్ట్రంపై పట్టు సాధిస్తారనే భయం, ఆందోళనతోనే మమత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆగర్భశత్రువుగా భావిస్తూ విరుచుకుపడుతున్నారు. బీజేపీతో వామపక్షాలకు సైద్ధాంతికంగా తీవ్ర విభేదాలున్నాయి. మమత బీజేపీతో గతంలో కలిసి పనిచేసిన ఉదంతాలున్నాయి. కానీ వామపక్షాలు బీజేపీతో కలవడం కలలోని మాట. అయినప్పటికీ కేరళకు ప్రధాని వచ్చినప్పుడు అధికారిక కార్యక్రమాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని ప్రొటోకాల్ పాటించారు. బీజేపీతో వామపక్షాలను మించి విభేదించేవారు దేశంలో ఎవరూ లేరు. అయినప్పటికీ రాజ్యాంగ విలువలను పాటిస్తూ వామపక్ష ప్రభుత్వమే ప్రధానిని గుర్తించి గౌరవిస్తోంది. కలిసి పనిచేసిన మమత, చంద్రబాబులు మాత్రం కాదు పొమ్మంటున్నారు. ప్రధానినే గుర్తించమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట పడకపోతే భవిష్యత్తులో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 18166 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*