“అంత” ఉంటేనే టిక్కెట్టట….!

ఎన్నికలలో ఈసారి ప్రజాదరణ కోసం నేతలు లెక్కలు గట్టడం లేదు. ఎంత ఖర్చు పెట్టగలరు? ఎంత ముందస్తుగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు? ఇప్పటికి ఎంత డబ్బు వారి వద్ద ఉంది? అందుకు సంబంధించిన ఆర్థిక సంపన్నత, స్థితి గతులేమిటి? ఇవే ప్రధాన ప్రాతిపదికలుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ లెక్కలు రూపుదిద్దుకుంటున్నాయి. అటువైపు తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళుతోంది. ఇటువైపు ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు డబ్బు సమీకరణపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇంకా ఎనిమిది నెలల గడువు ఉండగానే నేతలు కాసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రవాహంలా డబ్బు పారనున్నట్లు తేటతెల్లమవుతోంది. ఏపీలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు కలిసి వస్తున్న నేపథ్యంలో వేల కోట్ల రూపాయల ఖర్చునకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. వ్యక్తిగతంగా అభ్యర్థులకూ ఓట్ల కొనుగోలు సామర్థ్యం ఉందో లేదో బేరీజు వేస్తున్నారు. సొమ్ముంటేనే సీటు పక్కా అని పచ్చిగా చెప్పేస్తున్నారు.

డబ్బు టుది పవర్…

అధికార పీఠం అదిష్టించడానికి డబ్బును మించిన సాధనం లేదని పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీది ఒక రికార్డు . ఆరునెలల క్రితమే ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఎంత ఖర్చవుతుందనే లెక్కలు వేశారు. దాదాపు 25 కోట్ల రూపాయల వరకూ అవసరమవతుందని అంచనా వేశారు. దానికనుగుణంగా యాక్షన్ ప్లాన్ సైతం సిద్దం చేశారు. ఆర్థికంగా సంపన్నత కలిగిన వారు, పదవీ కాలంలో కాంట్రాక్టులు, ఇతర మార్గాల్లో ధనార్జన చేసిన వారు, ప్రజల్లో ఆదరణ కలిగి డబ్బులు పెద్దగా సంపాదించని కేటగిరిల్లో మూడు వర్గాలుగా వచ్చే ఎన్నికల నాటికి తలపడనున్న అభ్యర్థులను విభజించారు. ఆర్థికంగా సంపన్నత కలిగిన వారికి పార్టీ నుంచి నిధులు సమకూర్చాల్సిన అవసరం లేదు. ప్రచార సామగ్రి, సాంకేతిక సహకారం, సాంస్క్రుతిక కార్యక్రమాల ఏర్పాటు వంటివి మాత్రం సమకూరుస్తారు. కాంట్రాక్టర్లు అభ్యర్థులుగా నిలిచిన చోట సొమ్ములు సైతం సొంతంగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇక ప్రజల్లో ఆదరణ ఉండి తమ పదవీ కాలంలో పెద్దగా సంపాదించని వారి విషయంలో పార్టీ యే మొత్తం నిధులను సమకూరుస్తుంది. ప్రచారానికి అవసరమైన సహకారాన్ని, ఎన్నికల ఖర్చును , ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అవసరమైన ఏ ఖర్చు లేదా పంపిణీని సర్వం సహా సమకూర్చే బాధ్యతను అధిష్టానమే తీసుకుంటుంది. ఇందుకు ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకూ భారం పార్టీపై పడుతుందని అంచనా. ఎవరికి ఎంత మేరకు సహాయం చేయాలి? ఏ రూపంలో నిధులు అందచేయాలన్న విషయాలపై ఇప్పటికే బ్లూప్రింట్ సిద్దం చేసినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.

ఆ….నియోజకవర్గాల్లో……

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రధానమైన ఖర్చును పార్టీయే భరిస్తుంది. మొత్తం నిధులను పార్టీ ఖాతా నుంచి వెచ్చించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీలు, బలహీనవర్గాలు, ఆర్థికంగా అంత పరిపుష్టి లేని వారిని అభ్యర్థులుగా నిలిపే ప్రాంతాల్లో మూడొంతుల వ్యయం పార్టీ కాతానుంచే మళ్లిస్తారు. కొంత మొత్తాన్ని అభ్యర్థులే పెట్టుకోవాలి. పార్టీ చేసే ఖర్చువిషయంలో ప్రతిపైసా ఏరకంగా వ్యయమైందన్న విషయాన్ని పర్యవేక్షించేందుకు అధిష్టానం ఇప్పట్నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతోంది. నిధులను సద్వినియోగం చేస్తూ మొత్తం ఖర్చుతో ఉద్దేశించిన లక్ష్యం నెరవేరాలని పార్టీ భావిస్తోంది. అవసరమైతే నాలుగు నెలల ముందునుంచే పార్టీ సమన్వయ కర్తల పేరిట అధిష్టానం దూతలను పంపాలనుకుంటున్నారు. వీరందరూ కార్యకర్తలతోపాటు నాయకులను సమన్వయం చేసే పేరిట నియోజకవర్గమంతా పర్యటిస్తారు. భౌగోళిక స్థితిని, నిధుల అవసరాన్ని గుర్తిస్తారు. నిధుల పంపిణీ మార్గాలను, అవసరమైన మధ్యవర్తులను ఎంపిక చేస్తారు. అధికారానికి డబ్బుల అవసరాలకు మధ్య ఇంతటి పెద్ద కసరత్తు మొదలైంది. ఇది మరిన్ని మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

సొమ్ము మీది..ఖర్చు మాది…

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చు కసరత్తును చూసి వైసీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకూ నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవారి ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. పునస్సమీక్ష మొదలు పెట్టారు. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన చాలామంది ఇన్ ఛార్జులుగా ఉన్నారు. పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై గోడ దూకేసిన వారు 23 మంది ఉన్నారు. వారి స్థానాల్లో ఇన్ చార్జులను పెట్టారు. ఎమ్మెల్యేలు గా కొనసాగుతున్నవారూ ఎలాగూ అధికారికంగానే ఇన్ ఛార్జులు. నిన్నామొన్నటివరకూ వీరందరికీ టిక్కెట్లు ఖాయమనే భావన ఉంది. తాజాగా పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా ఉన్నవారిలో 65 మంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్లు పార్టీ అంచనా. రెండు మూడు కోట్ల రూపాయల వరకూ సొంత ఖర్చును భరించగలరు. కానీ రానున్న ఎన్నికల్లో పదికోట్ల పైచిలుకు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పార్టీ నుంచి పెద్దగా ఆర్థిక సాయం అందించే పరిస్థితులు లేవు. అభ్యర్థులే తమ ఖర్చును భరించాలి. అందుకు తగిన ఆర్థిక స్తోమత ఉన్నవారే ముందుకు రావాలని పార్టీ అభిప్రాయపడుతోంది. ఇంతకాలం తాము నియోజకవర్గాల్లో పనిచేశాము కాబట్టి తమకే టిక్కెట్లు ఇవ్వాలని ఇన్ ఛార్జులందరూ కోరుతున్నారు. మీరెంత డబ్బు ఖర్చు పెడతారు? మీ వద్ద ఉన్న నిధుల వివరాలు చూపించండి? అంటూ పార్టీ నాయకత్వం కోరుతోంది. మేము సమకూర్చుకుంటామంటూ కొందరు చెబుతున్నారు. పార్టీ కొంతమేరకు నిధులు సమకూర్చాలని మరికొందరు డిమాండు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని అగ్రనాయకత్వం స్పష్టం చేసేస్తోంది. పైపెచ్చు ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులను మార్చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ‘డబ్బులు ఖర్చు పెట్టరేమోననే అనుమానం ఉన్న చోట్ల పార్టీకి నిధులివ్వండి. ఎన్నికల్లో మీ తరఫున మేము ఖర్చు పెడతాం. ’ అంటూ అగ్రనాయకుల ప్రతినిధులు తరఫున మంతనాలు మొదలు పెట్టారు. మొత్తమ్మీద డబ్బుల వ్యవహారం వైసీపీలో గందరగోళ పరిస్థితులకు తావిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*