ఇద్దరూ ఎలా గట్టెక్కుతారో….?

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు కి మరో పరీక్ష పెట్టనుంది. ఎపి విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆయన జత కట్టక తప్పని పరిస్థితి ఈ ఎన్నిక తేబోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఫలితంగా ఆ ప్రభావాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇదే ఎన్నికపై వైసిపి అధినేత జగన్ కి సైతం తలనొప్పి ఎదురుకాబోతుంది. కాంగ్రెస్ ను వ్యతిరేకించే వైసిపి ఎన్డీయే కు ప్రస్తుత పరిస్థితుల్లో మద్దతిస్తే టిడిపి జగన్ పై చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లే అవుతుంది.

సైకిల్, ఫ్యాన్ వ్యూహ ప్రతివ్యూహాలు …

రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మెన్ స్థానం గెలుచుకునేంత బలం లేని బిజెపికి వైసిపి మద్దతు అత్యంత కీలకం. కాంగ్రెస్ కి, థర్డ్ ఫ్రంట్ కి దూరంగా వున్న జగన్ బిజెపి అభ్యర్ధికి జై కొట్టక తప్పని స్థితి ఎదురౌతుంది. అదే జరిగిన వెంటనే టిడిపి మరోసారి పెద్దఎత్తున వైసిపి కమలం దోస్తీపై తెలుగుదేశం దాడి తీవ్రం చేసి రాజకీయ లబ్ది పొందనుంది. ఇక టిడిపి థర్డ్ ఫ్రంట్ నిలబెట్టే అభ్యర్ధికి మద్దత్తు ఇస్తే అందులో కాంగ్రెస్ కీ రోల్ పోషించనుంది. లేదు కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టే పక్షంలో, బిజెపిని వ్యతిరేకించే పక్షాలు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురౌతుంది.

ఇరువురికి ఇరకాటమే …

ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది జరిగినా టిడిపి అటు వైపే నిలవక తప్పదు. అదే జరిగితే ఎపి విభజన తరువాత కాంగ్రెస్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియోలను పెద్దఎత్తున సోషల్ మీడియా ద్వారా తన సొంత మీడియా ద్వారా ప్రచారంలో పెట్టాలని వైసిపి ఎదురుచూస్తుంది. సమన్యాయం చేయలేదని రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అన్యాయం చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజలముందు పెట్టి తమపై దాడిని తిప్పికొట్టాలని వైసిపి వ్యూహం రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తానికి రెండు పార్టీలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక తలపోటుగానే మారనుందని స్పష్టం అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*