ఆయన వాళ్లతో….ఈయన వీళ్లతో…!

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ…. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఏపీ ప్రజలు శత్రువులుగా భావిస్తున్న పార్టీలను వైరి పక్షానికి మిత్రులను చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. వారితోనే లాలూచీ రాజీకీయాలు, కుమ్మక్కు పాలిటిక్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా ఒక్కటే కాదు ఏ సభలోనైనా ఇదే తంతు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ తో ఎన్నికల్లో విజయం సాధించాలన్నది ఒక ఎత్తు కాగా, ప్రత్యర్థి పార్టీని జాతీయ పార్టీలతో ముడిపెట్టి రాజకీయాన్ని వేడెక్కెస్తున్నాయి.

ఎన్నికల హీట్ ఎలా ఉందంటే….?

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నెలల నుంచి ఎన్నికల వేడి అలుముకుందనే చెప్పాలి. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను గత ఏడాది నవంబరు 6వ తేదీ నుంచి ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి మరీ ప్రజల్లోకి వెళ్లిన జగన్ ఒకవైపు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు ఇలా ఎప్పటి నుంచో తమ వ్యూహాలను అమలుపరుస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో బీజేపీ నుంచి చంద్రబాబు బయటకు వచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తొలుత మంత్రుల చేత రాజీనామా చేయించి, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి వైదొలిగి చంద్రబాబు బీజేపీకి ఝలక్ ఇచ్చారు.

బీజేపీతో వైసీపీ…..

అయితే బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలంటూ తెలుగుదేశం పార్టీ పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోవడం, ప్రత్యేకహోదా సాధ్యం కాదని చెప్పడంతో బీజేపీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకే ఓటేసినట్లనేని తెలుగుదేశం పార్టీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి అండగా నిలబడటం, ఉప ఎన్నికలు రాకుండా రాజీనామాలు ఆమోదించుకోకపోవడం వంటి అంశాలను హైలెట్ చేస్తోంది తెలుగుదేశంపార్టీ. బీజేపీ పై ఉన్న వ్యతిరేకతను వైసీపీకి అంటించేందుకు ప్రయత్నం ముమ్మరంగా చేస్తోంది.

కాంగ్రెస్ తో టీడీపీ…..

ఇకవైసీపీ కూడా ఇందులో తక్కువేమీ తినలేదు. తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతూనే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలంటూ స్పీడ్ ను పెంచింది. బీజేపీతో సమానంగానే ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో ఇప్పటికీ ఏహ్యభావం పోలేదన్నది వాస్తవం. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి బెంగళూరు వెళ్లిన చంద్రబాబు అక్కడ రాహుల్, సోనియాలతో మాట్లాడిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. పార్లమెంటు తలుపులు మూసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో జత కట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయిందని, వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకున్నా, ఎన్నికల అనంతర పొత్తు ఉంటుందని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇలా బీజేపీతో వైసీపీ, కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టే అంశాలను ఇప్పుడు రెండు పార్టీలు హైలెట్ చేసుకుంటున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*