జగన్ వస్తే అరాచకమేనా?

చంద్రబాబు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఆయన మహానాడులో కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. “ఇక ప్రతి కార్యకర్త ఈరోజు నుంచి సెలవులు తీసుకోవడానికి లేదు. ఆదివారం లేదు. పండగ లేదు. పబ్బం లేదు. ఏడాదంతా రేయింబవళ్లూ కష్టపడాల్సిందే.” అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. తమకు ప్రధాన ప్రత్యర్థులు, శత్రువులు నేరగాళ్లని, వారిని ఎదుర్కొనాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి వారి గురించి వివరించాలని చంద్రబాబు చెప్పారు.

విశ్రాంతి తీసుకోవద్దు……

2019 ఎన్నికల్లో తిరిగి అధికారం తమదేనని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వైసీపీ, బీజేపీ మిలాఖత్ రాజకీయాలను ప్రజలు నమ్మరని, నమ్మకద్రోహం చేసిన పార్టీ బీజేపీ అయితే, కుట్ర రాజకీయాలు చేస్తున్నది వైసీపీ అని, ఈ రెండింటి గురించి ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అరాచకం తప్పదని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందుకే ఈరోజు నుంచి ఇక విశ్రాంతి తీసుకోవద్దని, ప్రజాక్షేత్రంలోనే ఉండాలని కార్యకర్తలకు, నేతలకు హితబోధ చేశారు.

పొత్తు పెట్టుకుని తప్పు చేశాం….

గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున తెలుగుదేశం పార్టీయే నష్టపోయిందని చంద్రబాబు వివరించారు. గత ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీతో పొత్తు లేకుంటే మరో పది నుంచి పదిహేను స్థానాలను గెలిచే వాళ్లమన్నారు. తమతో పొత్తు పెట్టుకున్నందునే బీజేపీకి ఆ రెండు ఎంపీసీట్లయినా వచ్చాయని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కూడా తనవల్లే టీడీపీ గెలిచిందంటున్నారని, అది వాస్తవం కాదన్నారు. టీడీపీకి 70 లక్షలమంది కార్యకర్తలే బలమని, వాళ్లే తిరిగి గెలిపించుకుంటారని చంద్రబాబు కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం తమదేనన్నారు చంద్రబాబు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*