బాబు ఓడారు.. జ‌గ‌న్ గెలిచార‌ట‌…!

మ‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో అస్స‌లు త‌ల‌దూర్చ‌కూడ‌దంటారు పెద్ద‌లు. కానీ ఇలా త‌ల‌దూరిస్తే చివ‌రికి ఏమవుతుందో టీడీపీ నేత‌ల‌ను గ‌మ‌నిస్తే తెలుస్తుంది. మ‌న రాష్ట్రం కాదు.. మ‌న రాష్ట్రంలో జ‌రిగే ఎన్నిక‌లు కాదు.. ఏపీకి సంబంధించిన వాళ్లు అస‌లు లేరు.. అందులోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు ఎవ‌రూ పోటీలో కూడా పాల్గొన‌డం లేదు.. పోనీ అక్క‌డ అధికారంలో ఉన్నది మ‌న మిత్రుడా అంటే అదీ కాదు.. కానీ ఒకే ఒక్క ఎమోష‌న్‌.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు క‌నెక్ట్ అయింది. అదే బీజేపీ.. ప్ర‌ధాని మోడీ..! ఈ ఇద్ద‌రినీ ఎలాగైనా ఓడించాల‌నే పంతం ఇప్పుడు ఆయ‌నకు అప్ర‌తిష్ఠ మూట‌గ‌ట్టేలా చేస్తోంది.

అక్కడ వేలు పెట్టి…..

పొరుగున ఉన్న రాష్ట్ర రాజ‌కీయాల్లో వేలుపెట్టి.. అక్క‌డి తెలుగు ప్ర‌జల‌కు బీజేపీని ఓడించండి అంటూ పిలుపునివ్వ‌డం, కాంగ్రెస్ కంటే టీడీపీ కార్య‌క‌ర్త‌లు చూపిన అత్యుత్సాహం.. చివ‌రికి చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయేలా చేసింది. క‌ర్ణాట‌క ఫ‌లితాలు చూసిన టీడీపీ నేత‌ల్లో స‌రికొత్త ఆందోళ‌న మొద‌లైంది. పొరుగునే ఉన్న రాష్ట్రం.. అందులోనూ తెలుగు వారు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రంలో.. బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. ఏపీని కేంద్రం, బీజేపీ మోసం చేసింద‌ని దీనికి ప్ర‌తీకారంగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓటు వేయ‌కూడ‌దంటూ సంకేతాలిచ్చారు. బీజేపీని ఓడించాల‌ని ఏపీ ఎన్జీవో అధ్య‌క్షుడే చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇదే పిలుపునిచ్చారు. కానీ తెలుగు ప్రజలు ఎవరూ చంద్రబాబు, టీడీపీ నేతల పిలుపును ఏ మాత్రం పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది.

అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే….

కర్ణాటకలో తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఉన్నారు. ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు అయితే కర్ణాటక వెళ్ళి మరీ తెలుగు సంఘాలతో సమావేశం అయి రాజ‌కీయాలు న‌డిపారు. కానీ ఫలితాలను పరిశీలిస్తే చంద్రబాబు డిమాండ్ ను తెలుగు ప్రజలు ఏ మాత్రం పట్టించుకున్నదాఖలాలు లేవు. అక్కడ ఉన్న తెలుగువారికి ఏపీపై ఏ మాత్రం ప్రేమలేదన్నట్లా? అంటే క‌చ్చితంగా ఏ మాత్రం కాదని చెప్పొచ్చు. ఓటు అనేది అక్కడ పరిస్థితులకు అనుగుణంగా..వారి వారి అభిప్రాయాల ప్రకారం వేసుకుంటారు. అంతే తప్ప…చంద్రబాబు చెప్పారనో..లేక మరొకరు చెప్పారనే పరిగణనలోకి తీసుకోరు.

జగన్ ఎక్కడా మాట్లాడకుండా….

వాస్తవానికి వైసీపీ అధినేత జగన్‌మోహ‌న్‌ రెడ్డి కర్ణాటక ఎన్నికల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. టీడీపీ మాత్రం వైసీపీ అనుకూలురు అంతా కర్ణాటకలో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని.. ఏపీకి అన్యాయం చేసిన మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ఎందుకు ప్రకటన చేయరని పదే పదే ప్రశ్నలు వేశారు. వీరిద్దరి కుమ్మక్కుకు అంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నలు సంధించారు. టీవీ చర్చల్లోనూ ఇదే వాదన విన్పించారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా పట్టించుకోని తెలుగు ఓటర్లు.. ఓ మాట చెప్పకపోయినా జగన్ మాటకు విలువ ఇచ్చిన‌ట్టా? తెలుగుదేశం నేతల మాటలు చూస్తే ఎవరైనా అలాగే అనుకోవాల్సి వస్తుందంటున్నారు విశ్లేష‌కులు. తెలుగుదేశం నేతల వాదన ప్రకారం చూస్తే కర్ణాటకలో చంద్రబాబు ఓడిపోయారు.. జగన్ గెలిచారు. మరి ఈ ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*