బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా….?

కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకతే ప్రధాన సిద్ధాంతంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తెలంగాణాలో తమ ప్రత్యర్థితో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ బతికివుంటే తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చేవారని టిడిపిలోనే ఆఫ్ ది రికార్డ్ లో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. హరికృష్ణ గత కొంతకాలంగా చంద్రబాబు తో ఎడముఖం గానే వుంటూ వస్తున్నారు. తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం పై ఆయన అసంతృప్తిగా ఉండేవారని ఆయన సన్నిహితుల సమాచారం. తండ్రి ఎన్టీఆర్ ఆశయం, ఆకాంక్ష తన శ్వాసగా మాట్లాడే హరికృష్ణ పాలిట్ బ్యూరో సభ్యుడుగా వున్నారు. ముక్కుసూటిగా వుండే హరికృష్ణ అంటే చంద్రబాబు కు సైతం కొంత టెన్షన్ అంటారు.

కాంగ్రెస్ తో పొత్తును  …

టిడిపి కాంగ్రెస్ లు పొత్తు వాసనలు గుప్పుమనగానే కస్సున లేచారు ఏపీలో సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణ మూర్తి. వారికి ఆ తరువాత చంద్రబాబు సర్ది చెప్పడంతో తాత్కాలికంగా వివాదం సర్దుమణిగింది. పొత్తు తెలంగాణ వరకే ఉంటుందని లీడర్లను, క్యాడర్ ని బాబు శాంతిప చేశారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు ఎపి పై కూడా పడుతుందన్న ఆందోళన టిడిపి వర్గాల్లో బాగా వుంది.

అయినా సరే…..

ఎపి విభజన చేసి కాంగ్రెస్ ఎలా నష్టపోయిందో అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందేమో అన్న భయం పలువురిని వెంటాడుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించి అధర్మం గా రాష్ట్ర విభజన చేశారని ఎన్నికల్లో భారీగా లబ్ధిపొందిన తెలుగుదేశం అలాంటి పార్టీతో పొత్తుకు వెళ్లడం ఆత్మహత్యసదృశ్యమని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అందుకే బాబు తెలంగాణ లో కాంగ్రెస్ తో చేతులు కలిపే అంశాన్ని టిటిడిపి కి అప్పగ్గించి లౌక్యత ప్రదర్శించారు. అయినా కానీ ఏపీలో పరిణామాలు ఎలా వుంటాయో అన్న ఆందోళన మాత్రం టిడిపి ని వీడటం లేదు. మరి చంద్రబాబు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*