కౌంటర్లు లేవ్…ఓన్లీ ఎన్ కౌంటర్లే….!

ఏపీ బీజేపీలో అంతా పుచ్చు స‌రుకేనా? త‌మ‌ను తాము కాపాడుకునే ప్రయ‌త్నం కూడా చేయ‌లేరా? పార్టీలో సుదీర్ఘ చ‌రిత్ర ఉంద‌ని చాటుకునే నాయ‌కులు పార్టీని పార్టీ నాయ‌కుల‌ను కాపాడుకోలేక పోతున్నారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే తెర‌మీదికి వ‌స్తున్నాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీపై నిప్పులు కురిపించారు. ప్రధాని మోడీకి ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌పై ఉన్న ప్రేమలో 5 శాతం ఉన్నా ఏపీ ఎప్పుడో అభివృద్ధి చెందేదని విమ‌ర్శించారు. కేంద్రం ఏపీపై కక్ష సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం, బీజేపీ చేసిన అన్యాయాన్ని వివ‌రించేందుకు ఏపీ శాస‌న స‌భ‌ను అద్భుతంగా వాడుకున్నారు. పాడిందేపాట అయినా స‌రికొత్తగా వినిపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య బీజేపీ గొడ‌వ‌లు పెట్టింద‌ని దుయ్యబ‌ట్టారు.

బీజేపీ నేతలు చూస్తూ……

మ‌రి చంద్రబాబు.. బీజేపీపైనా ఆ పార్టీ నేత‌ల‌పైనా ముఖ్యంగా ప్రధాని న‌రేంద్ర మోడీపైనా విరుచుకుప‌డుతుంటే.. బీజేపీ నేత‌లు ఏం చేస్తున్నట్టు? చ‌ంద్రబాబుకు వీరు భ‌య‌ప‌డుతున్నారా? లేక వీరికి స‌బ్జెక్టు తెలియ‌దా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బీజేపీ నేత‌ల‌కు సంధిస్తున్నారు నెటిజ‌న్లు. వాస్తవానికి రాష్ట్రంలో జ‌రుగుతున్న చాలా వ‌ర‌కు అభివృద్ధి ప‌నులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల‌కు కేంద్రం నుంచి నిధులు ధారాళంగానే వ‌స్తున్నాయి. గ్రామీణ స‌డ‌క్ యోజ‌న‌, ఇంటింటికీ ఫైబ‌ర్ నెట్‌, ఇంటింటికీ మ‌రుగుదొడ్డి, ఎన్టీఆర్ గృహ‌క‌ల్ప(ఇది కూడా కేంద్ర ప‌థ‌కం), అంగ‌న్‌వాడీ, ఆశా కార్యక‌ర్తల జీతాల పెంపు(ఈ విష‌యాన్ని కేంద్రం ప్రక‌టించ‌క ముందుగానే విష‌యం తెలుసుకుని చంద్రబాబు అమ‌రావ‌తిలో హ‌డావుడిగా ప్రక‌టించారు. కానీ, వాస్తవానికి కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌తోనే అంగ‌న్ వాడీల‌కు డ‌బ్బులు ఇస్తున్నారు. దీనిలో రాష్ట్ర వాటా కేవ‌లం 10%) వంటివి చాలానే ఉన్నాయి.

కౌంటర్ ఇవ్వడంలో…..

అయినా కూడా చంద్రబాబు కేంద్రం నుంచి రూపాయి కూడా రావ‌డం లేద‌ని మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో బీజేపీ నాయ‌కులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కౌంట‌ర్ ఇవ్వడంలో పూర్తిగా విఫ‌ల‌మవుతున్నార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌కు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వడంలోనూ.. బాబు నోటికి తాళం వేయ‌డంలోనూ పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నార‌ని అన్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాలు టీడీపీని హైలెట్ చేస్తున్నాయే త‌ప్ప.. రాజ‌కీయంగా బీజేపీకి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తున్నాయ‌ని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా మౌనంగా ఉండ‌డంపై స‌ర్వత్రా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. మ‌రి దీనిని ఎలా స‌రిచేసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*