లైఫ్‌ టర్న్‌ అవుతుందా….??

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారింది. నిన్నటి వరకు ఒకలా నడిచిన రాజకీయం కాస్త ఇప్పుడు సరికొత్త పుంత‌లు తొక్కుతూ ఎవరి అంచనాలకు అందకుండా ముందుకు వెళ్తుంది. మూడున్నర దశాబ్దాలుగా చిరకాల రాజకీయ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ ఒకటి అవుతున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశ, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్‌కు వ్యతిరేఖంగా, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ ఒకే గూటికి ఎందుకు చేరుకున్నాయి ? ఈ రెండు పార్టీల పొత్తు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లోనూ కంటిన్యూ అవ్వడం దాదాపు ఖాయ‌మే.

గత ఎన్నికల్లోపొత్తుతోనే….

తెలంగాణలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మల్కాజ్‌గిరి ఎంపీ సీటుతో పాటు 15 అసెంబ్లీ సీట్లలో గెలిచింది. ఇప్పుడు బీజేపీతో, టీడీపీ పొత్తు చిత్తు అవ్వడంతో పాటు ఈ రెండు పార్టీల మధ్య‌ పచ్చ గడ్డి వేస్తే భ‌గ్గుమనే రేంజులో తీవ్రమైన శతృత్వం నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌, టీడీపీ మహాకూటమిగా ఏర్పడి దేశ రాజకీయాల్లోనే పెద్ద సంచలనానికి తెర తీశాయి. ఈ కూటమిలో భాగంగా టీడీపీకి, కాంగ్రెస్‌ 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సుముఖ‌త వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని సైతం కలిసి జాతీయ రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ కలయికపై పెద్ద సంచలనానికి తెర తీయడంతో పాటు దేశంలో బీజేపీయేతర పక్షాలన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలో ఒక్కటి కావాలని పిలుపునివ్వడం రాజకీయంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఏపీలో కూడా అదే సీన్….

ఇదిలా ఉంటే టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు వచ్చే ఏడాది ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సైతం కంటిన్యూ చేసేందుకే మొగ్గు చూపుతారని కూడా తెలుస్తోంది. ఏపీలో రాష్ట్ర విభజన దెబ్బకు కాంగ్రెస్‌ పార్టీ చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్ర విభజన దెబ్బతో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క ఎంపీ, అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు సాధించుకోకలిగారు. ఎన్నికల తర్వాత కూడా పలువురు సీనియర్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలోకి జంప్‌ చేసేశారు. అక్కడక్కడా మాత్రం కొందరు ఇంకా కాంగ్రెస్‌ పార్లీనే పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పుడు టీడీపీ పొత్తు ఆ నాయకుల పాలిట వరం అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు కుదిరితే కాంగ్రెస్‌ పార్టీకి కొన్ని ఎంపీ స్థానాలతో పాటు సింగిల్‌ డిజిట్‌ వరకు అసెంబ్లీ సీట్లు సైతం ఇస్తారని కూడా రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

రఘువీరా మళ్లీ….

ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చే ఎంపీ సీట్లలో ఒకటి రాయలసీమలోని కర్నూలే అవుతుందని కూడా పలువురు అంచనా వేస్తున్నారు. ఇక్కడ నుంచి దివంగత మాజీ ముఖ్య మంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఫ్యామిలీ ఇంకా కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేసిన విజయభాస్కర్ రెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ఏకంగా లక్ష పైచిలుకు ఓట్లు సాధించగా… ఆయ‌న భార్య కోట్ల సుజాతమ్మ సైతం ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి డిపాజిట్లు దక్కించుకున్న అతి కొద్ది మందిలో ఒకరిగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోటాలో కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డితో పాటు ఆలూరు లేదా డోన్‌ నుంచి సుజాతమ్మకి అసెంబ్లీ సీటు దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే రాయలసీమకే చెందిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అనంతపురం జిల్లాలోఓ అసెంబ్లీ సీటు ఖాయంగా దక్కనుంది. రఘువీరారెడ్డి 2009లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా గత ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆయనను మారుస్తారా…?

ప్రస్తుతం పెనుగొండలో టీడీపీకి బీసీ ఎమ్మెల్యే ఉన్నందునా కళ్యాణదుర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని మారుస్తారన్న వార్తల నేపథ్యంలో రఘువీరారెడ్డికి కళ్యాణదుర్గం సీటు దక్కే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి అలాగే శింగనమలలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీ బాలను తప్పిస్తే మాజీ మంత్రి శైలాజనాథ్‌కు కూడా ఛాన్స్‌ ఉండొచ్చు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌ వలీ పేరు వినపడుతుంది. గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఆయన ఇప్పటికి కాంగ్రెస్ కీల‌క నేత‌లు గులామ్‌న‌బీ అజాద్ లాంటి ప్రముఖలతో స‌త్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు నుంచి మస్తాన్‌ వలీ పేరు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ నుంచి వినపడుతుంది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా కొంత మంది ప్రముఖులు ఇంకా కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతున్నారు. వీరితో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ నగరంలోని నాలుగు సీట్లలో ఏదో ఒక అసెంబ్లీ సీటు కేటాయించే ఛాన్సులు ఉన్నాయి. మరి వీరితో పాటు ఎన్నికల వేళ‌ ఈ రెండు పార్టీల మధ్య‌ పొత్తు కుదిరి టీడీపీ ఇచ్చే సీట్ల సంఖ్యను బట్టి మరికొంత మంది కాంగ్రెస్‌ వాళ్లకు సీట్లు ద‌క్కొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*