బాబు ఆయనకు…లోకేష్ ఈయనకు… !

ఏపీలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు లెక్కకు మిక్కిలిగా ఆశావాహులు ఉన్నారు. ప్రతి ఎన్నికకు పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆశావాహుల లెక్క పెద్దగానే ఉన్నా ఈ సారి మాత్రం ఓ కీలకమైన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ఇటు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌ వేరు వేరు వ్యక్తులకు సపోర్ట్‌ చెయ్యడమే ఇక్కడ ఆసక్తిగా మారింది. ఏపీలో త్వరలో కృష్టా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ముమ్మరంగా ప్రయత్నాలు…..

కీలకమైన రాజధాని ప్రాంతం కావడంతో తాము చేసిన అభివృద్ధి నేపథ్యంలో ఈ సీటును ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది.ఇంకా చెప్పాలంటే ఈ ఎన్నికను ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి పీడీఎఫ్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పేరు ఖ‌రారు అయ్యింది. యూడీఎఫ్‌, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాల సంయుక్త అభ్యర్థిగా ఆయన పేరును త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ఈ స్థానంలో పోటీ చేసేందుకు టీడీపీ తరపున కృష్ణా జిల్లా నుంచి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ, కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత చిగురుపాటి వరప్రసాద్‌, టీడీపీ నాయకుడు కొల్లి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా నుంచి మాజీ జెడ్పీచైర్మన్ రాయపాటి శ్రీనివాస్‌, దాసరి రాజామాస్టారు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాసరావు తదితరులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు మాత్రం……

సీటు ఆశిస్తున్న వీరు ఎవరికి వారు ఎమ్మెల్సీ సీటు తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. కొంత మంది భారీగా ఓటర్లను చేర్పిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌ ఇక్కడ వేరు వేరు వ్యక్తులకు ఇంటర్నల్‌గా సపోర్ట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. సీటు ఎవరికి దక్కినా వీరిద్దరి మదిలో వేరు వేరు వ్యక్తులు ఉండడమే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి రాయపాటి శ్రీనివాస్‌, చిగురుపాటి వరప్రసాద్‌ల‌లో ఎవరో ఒకరిని రంగంలో దింపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. అదే టైమ్‌లో మంత్రి లోకేష్ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఏపీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పోటీ చేయించాలని… బ్రహ్మంను పోటీలో పెడితే టీడీపీ యువతకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది.

కాపు సామాజికవర్గం నుంచి…..

మరో వైపు ఈ సీటును ఎప్పుడూ కూడా పార్టీ తరపున కమ్మ సామాజికవర్గానికే ఇస్తున్నారని… ఈ సారి తమకు ఇవ్వాలని కాపు నేతలు, బీసీ నేతలు కోరుతున్నారు. కాపు సామాజికవర్గం నుంచి తనకు ఛాన్స్‌ ఇవ్వాలని ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మ‌న్ దాసరి రాజా మాస్టారు ఇప్పటికే చంద్రబాబును కలిసి కోరారు. దీంతో ఈ సీటు కోసం టీడీపీలోనే పలువురు సీనియర్లు పోటీ పడుతుండడం లోకేష్‌, చంద్రబాబు ఆలోచనలు వేరు వేరుగా ఉండడంతో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరు అవుతారన్నది సస్‌పెన్స్‌గానే ఉంది. గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాలకి పీడీఎఫ్‌ అభ్యర్థిగా యూటీఎఫ్‌ నాయకుడు ఐ. వెంకటేశ్వరరావు పేరు ఖ‌రారు అయ్యినట్టే అని తెలుస్తోంది. టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రవికిరణ్‌ వర్మ, ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిమెల్లి శేషారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు మొగ్గు రవికిరణ్‌ వర్మ వైపే ఉన్నట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*