లక్ కలసి వస్తుందనేనా..?

nara-chandrababunaidu-national-politics

ఎన్నిక ముగిసింది. ఫలితం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. లెక్కలు వేసుకున్నారు. టెన్షన్ పడ్డారు. ఇక చాల్లే. చేసేదేముందని సరిపెట్టుకున్నారు. ఉత్కంఠ తగ్గించుకోవడానికి మార్గాన్వేషణ చేశారు. దాదాపు అందరు ప్రధాన నాయకులు విశ్రాంత దశలోకి వెళ్లిపోయారు. ఒక్క నాయకుడు మాత్రం ఇంకా ఆ వేడి కొనసాగిస్తూనే ఉన్నారు. పోరాటం వదిలిపెట్టలేదు. వేడిని మరింతగా పెంచారు. ప్రత్యర్థి పార్టీపై కాకుండా తన దృష్టిని భారత ఎన్నికల సంఘంపై గురిపెట్టి ప్రధాని నరేంద్రమోడిని కొట్టాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు హస్తిన కేంద్రంగా చక్రం తిప్పేందుకు అన్ని హంగులు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచే తన ప్రణాళికను ఆచరణలోకి తెచ్చేశారు. అన్నీ తానై ప్రచారం చేసిన తర్వాత ఎవరైనా అలసిపోతారు. ఫలితం కోసం ఎదురుచూస్తారు. ఈలోపు సాధ్యమైనంతవరకూ రాజకీయకార్యకలాపాలకు దూరంగా కుటుంబసభ్యులతో వేరే ప్రాంతాల్లోగడుపుతారు. కానీ చంద్రబాబు దీనికి భిన్నం. పొలిటికల్ షెడ్యూల్ తో రాజధానిలో మకాం వేశారు. ఎలక్షన్ ప్రచారాన్ని మించిన కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. దీని వెనక దాగి ఉన్న వ్యూహమేమిటన్నదే ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు నాయుడు ఏ పని చేపట్టినా దాని వెనక ఒక లక్ష్యం ఉంటుంది.

డబుల్ టేక్…

రాజకీయ నాయకుడు గెలుపోటములతో సంబంధం లేకుండా తర్వాతేమిటన్న విషయమై సిద్ధమై పోవాలి. గెలిస్తే ఏం చేయాలి? ఓడిపోతే ఏం చేయాలి? రెంటికీ సిద్ధపడాలి. పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లాలి. పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. అందుకే రాష్ట్రంలో పాలిటిక్స్ ను ముగించి, అనుసంధానంగా ఢిల్లీ పాలిటిక్స్ చేపట్టారు. ఇందులో రెండు టార్గెట్లు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణలోని వైఫల్యాలు, ఈవీఎంల సాంకేతిక లోపాలు, టాంపరింగ్ అవకాశాలు, వీవీపాట్ల లెక్కింపు అనే అజెండాతో చంద్రబాబు సీరియస్ గా పోరాటం చేస్తున్నట్లుగా పైకి కనిపిస్తుంది. కానీ పార్టీని రెండు విధాలుగా సిద్ధం చేసే క్రమంలో ఆయన తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారంటున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నిక ఏ పార్టీకి ఏకపక్షంగా గెలుపు తెచ్చిపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతో సరిపుచ్చుకోవాల్సిందే. ఈ స్థితిలో తెలుగుదేశం గెలిస్తే మెజార్టీ తగ్గడానికి ఈవీఎంల లోపాలే కారణమనే నింద వేయవచ్చు. ఓటమి ఎదురైతే తాను ముందునుంచీ పోరాటం చేస్తున్నది టాంపరింగ్ అవకాశాలపైనే అంటూ సాకులు చెప్పవచ్చు. ఈరకంగా పార్టీకి ఏరకంగానూ ఇబ్బంది తలెత్తకుండా పక్కా గా పథకం రచన చేస్తున్నారనేది తెలుగుదేశంలోని ఉన్నతవర్గాల అంచనా. ఇంతపెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ భారీ విజయం లభించకపోతే అవమానం. అలాగే ఓటమి పాలైతే తలెత్తుకునే పరిస్థితి ఉండదు. ఇంతటి రాజకీయ వైషమ్య పరిస్థితుల్లో టీడీపీ నైతికస్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అటువంటి అనివార్య పరిస్థితికి సైతం పార్టీని సిద్ధం చేయడంలో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ పోరు మొదలు పెట్టారనేది రాజకీయ వర్గాల భావన.

జాతీయ పాత్రలో…

ఇప్పటికే చంద్రబాబు నాయుడు జాతీయంగా కీలకపాత్ర పోషిస్తున్నారు. జాతీయ పార్టీల నాయకులతోపాటు ప్రాంతీయ పార్టీల అధినేతలతో విస్తృత సంబంధాలు కలిగి ఉన్నారు. ఏపీ పర్యటనలో మాజీ ప్రధాని దేవె గౌడ భావిభారత ప్రధానిగా అభివర్ణించారు. ఒకవేళ ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో దేనికీ తగినంత మెజార్టీ రాకపోతే ప్రత్యామ్నాయ ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్నవారిలో చంద్రబాబు నాయుడు ఒకరు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి కూడా. మమతబెనర్జీ దూకుడు వైఖరి ప్రాంతీయ పార్టీల్లోనే కొందరికి నచ్చదు. ఎస్సీ వర్గాలకు చెందిన అభ్యర్థిగా మాయావతికి కూడా అవకాశాలు మెండు. అయితే ఆమె చంచల మనస్తత్వాన్ని , ఎవరినీ లెక్కపెట్టని తత్వాన్ని కొన్ని ప్రాంతీయపార్టీలు జీర్ణించుకోలేవు. శరద్ పవార్ ఆరోగ్యసమస్యలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం రాహుల్ తో కూడా మంచి సంబంధాలు నెరపుతున్నారు చంద్రబాబు నాయుడు. దీంతో ప్రాంతీయపార్టీలన్నీ కలిసి జట్టుకడితే మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెసు పార్టీ సిద్దంగానే ఉంది. టీడీపీ అధినేత పీఎం అభ్యర్ధిగా రేసులోకి వస్తే ఈ పని మరింత సులభమవుతుంది. ఈవీఎంల పై పోరాటం పేరుతో ఇప్పటికే ఎన్డీయేతర పార్టీలను చాలావరకూ చంద్రబాబునాయుడు ఏకం చేశారు. అది కూడా పీఎం రేసులో ఆయన నిలిచేందుకు అడ్వాంటేజ్ గా మారుతుంది.

ఇంట గెలిస్తేనే…

నేషనల్ ఫ్రంట్ పేరిట 1988-89లలో ఒక ప్రయోగం జరిగింది. ఎన్టీరామారావు దానికి ఛైర్మన్ గా కీలకపాత్ర పోషించారు. కకావికలమై చీలిపోయి ఉన్న పార్టీలను ఒకే వేదికపైకి ఆయన తేగలిగారు. రామారావు ప్రధాని లేదా కనీసం ఉప ప్రధాని అవుతారని అందరూ భావించారు. వీపీసింగ్ ఫ్రంట్ కు కన్వీనర్ గా వ్యవహరించేవారు. ఎన్టీయార్, వీపీసింగ్ లు కేంద్రంలో కీలకమవుతారనుకున్నారు. అయితే 1989 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో ఎన్టీరామారావు ప్రాధాన్యం కోల్పోయారు. దేవీలాల్ ఉప ప్రధాని అయ్యారు. వీపీ సింగ్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఎన్టీయార్ విపక్షాలన్నిటినీ ఏకం చేసినా ఇంట గెలవకపోవడంతో తన రాజకీయ జీవితంలో అరుదైన అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సైతం మంచి అవకాశాలున్నాయి. కానీ ఇంట గెలిస్తేనే అత్యున్నత పీఠానికి మార్గం సుగమవుతుంది. లేకపోతే రేసులో పట్టించుకునేవారుండరు. లక్ కలిసి వచ్చి తనను ఆంధ్రా ఓటర్లు ఆశీర్వదిస్తే.. సీనియార్టీ దృష్ట్యా పీఎం పీఠానికి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికీ చాన్సులున్నాయి. హస్తిన యాత్ర అందుకు కూడా ఉపయోగపడుతోందంటున్నారు పరిశీలకులు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 17221 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*