టీడీపీ ఎంపీ క్యాండేట్లు వీళ్లేనా..!

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని మంత్రి ఎవ‌రు కావాలో నిర్ణ‌యింది టీడీపీయేన‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. ఏపీలోని మొత్తం 25 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని ఢిల్లీలో చ‌క్రం తిప్పుతామంటూ ఆయ‌న చెప్పారు. అయితే.. ఇందుకు అనుగుణంగానే.. ఇప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ఆయా లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. అందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఇప్ప‌టికే ఎంపీల ప‌నితీరు, వారికి ప్ర‌జ‌ల‌తో, క్యాడ‌ర్‌తో ఉన్న సంబంధాలు.. త‌దిత‌ర అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు తెప్పించుకున్న స‌ర్వేలు ఉండ‌నే ఉన్నాయి. ఈ స‌ర్వేల‌తోపాటు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ, ఇత‌ర ప‌క్షాల ప్ర‌క‌టించే అభ్య‌ర్థుల ఆధారంగా చంద్ర‌బాబు తుది జాబితా ఎలా ఉండాల‌న్న‌దానిపై ప‌క్కా ప్లాన్‌తో వెళ్తున్నారు.

బాపట్ల స్థానాన్ని మాత్రం…..

ముందుగా కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సిట్టింగుల‌ను మార్చినా ఆశ్చ‌ర్యం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. విజయవాడ ఎంపీ సీటుపై కేశినేని నాని మరోసారి ఆశలు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయనే పోటీలో ఉంటారని పార్టీ వర్గాలంటున్నాయి. మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణకే టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. గుంటూరు పార్లమెంట్ సీటును గల్లా జయదేవ్‌కు ఖాయ‌మే. ఇందులోమ‌రో మాట లేద‌ని పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. బాపట్లలో శ్రీరామ్ మాల్యాద్రి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన్ను త‌ప్పిస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న స్థానంలో జూపూడి ప్రభాకర్ రావు, మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు (ఆయ‌న ఎంపీగా వెళ్లాల‌నుకుంటే ) పేర్లు రేసులో ఉన్నాయి. అయితే ఇక్క‌డ ఆర్థికంగా బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం కూడా టీడీపీ అన్వేషిస్తోంది.

మాగుంటను బరిలోకి దించి…….

నర్సారావుపేటలో ఈ సారి రాయపాటి సాంబశివరావు పోటీకి సుముఖంగా లేన‌ట్లు తెలుస్తోంది. ( అయితే చివ‌రి వ‌ర‌కు ఆయ‌న నిర్ణ‌యం ఎలా ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ) ఆయన వారసుడు రంగబాబు టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఒంగోలు ఎంపీ సీటును గెల‌చుకోవాల‌ని చంద్ర‌బాబు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. ఇందుక‌నుగుణంగా ఇటీవ‌ల వెలుగొండ ప్రాజెక్టుపై కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు ఆయ‌న‌. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైసీపీ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి గెలిచారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డినే పోటీ చేయించే అవకాశం ఉంది. ఈసారి మాగుంట విజయంపై ధీమాగా ఉన్నారు. నెల్లూరు కూడా వైసీపీ గెలుచుకున్న సీటు కావడంతో మేకపాటి రాజమోహన్‌ రెడ్డికి ధీటైన అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డిని బ‌రిలోకి దింపాల‌ని టీడీపీ నాయ‌కులు కోరుతున్నార‌ట‌. ఒక‌వేళ ఆయ‌న కాదంటే.. బీద మస్తాన్ రావు పేరు వినిపిస్తోంది. ఇక ఇందులో చంద్ర‌బాబు ఎవ‌రెవ‌రికి టికెట్లు ఇస్తారో తెలియాలంటే.. మ‌రికొంత కాలం ఆగాల్సిందే.