నో…టికెట్…బాబు నోటి నుంచి…!

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యే వల్లనే భ్రష్టుపట్టిపోయింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు దక్కదని భావించిన అనేకమంది ఆ నియోజకవర్గంపై కన్నేశారు. అమరావతి చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే జనం ముందుకు వచ్చారు. హడావిడి చేస్తున్నారు. అయినా పార్టీ అధిష్టానం మాత్రం ఆ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇస్తే ఓడిపోతామన్న నిర్ణయానికి వచ్చిందట. ఇదంతా ఆ ఎమ్మెల్యే స్వయంకృతాపరాధమేనంటున్నారు పార్టీ కార్యకర్తలు. నాలుగేళ్ల నుంచి కనపడకుండా ఇప్పుడు వచ్చి తాను ఉన్నానంటూ బిల్డప్ ఇస్తే ఎలా అంటోంది పార్టీ క్యాడర్.

సొంత పార్టీ నుంచే….

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోది ఈ పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ప్రజల నుంచే కాదు సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తిని తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాట దేవుడెరుగు..? అసలు ప్రజలకు కన్పించడమే మానేశారన్న విమర్ళలు ఆయనపై ఉన్నాయి. ఇక ప్రతిపనిలోనూ అవినీతికి ఎమ్మెల్యే అనుచరులు తెరలేపడంతో ఈసారి ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓటమి గ్యారంటీ అంటూ చంద్రబాబు వద్దకు గుట్టగుట్టలుగా విన్నపాలు చేరుకున్నాయట.

ఆయనకు టిక్కెట్ ఇస్తే….

2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ దాదాపుగా స్వీప్ చేసినా ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం పసుపు జెండా ఎగిరింది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎమ్మెల్యే బొల్లినేని రామారావు టీడీపీ క్యాడర్ ను పూర్తిగా పక్కనపెట్టేశారు. నియోజకవర్గంలో చేసే ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకోవడం ఆయన అనుచరుల పనయింది. పసుపు కొనుగోళ్లలో కూడా ఆయన అనుచరులు చేతివాటం ప్రదర్శించారన్నది బహిరంగ రహస్యమే. సోమశిల లిఫ్ట్, వెలిగొండ రిజర్వాయర్ల నుంచి రావాల్సిన సాగునీటీ ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోయారని ఆయనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇక్కడ కంటే మహారాష్ట్రంలో ఉండేందుకే ఇష్టపడే బొల్లినేని రామారావుకు ఈసారి టిక్కెట్ ఇస్తే చేసేది లేదు పొమ్మంటున్నారట తెలుగు తమ్ముళ్లు. దీంతో అధిష్టానం ఇక్కడ కొత్త అభ్యర్థికోసం అన్వేషణ ప్రారంభించింది.

అమరావతికి ఆశావహుల పరుగులు….

బొల్లినేని రామారావుకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం ఊపందుకోవడంతో అనేక మంది తాము పోటీ చేస్తామంటూ అమరావతికి పరుగులు తీస్తున్నారు. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. అయితే కావ్య కృష్ణారెడ్డి ఆనం రామనారాయణరెడ్టికి అత్యంత సన్నిహితుడు. ఈయనకు టిక్కెట్ ఇస్తే గెలిచి వైసీపీలోకి వెళతే పరిస్థితి ఏంటా? అన్న ఆలోచన కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇక్కడ బలమైన నేత కావాలని గట్టిగా సెర్చ్ చేస్తోంది. దీంతో ఇక బొల్లినేనికి టిక్కెట్ గల్లంతేనన్న ప్రచారం ఊపందుకుంది. ‘‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా’’ అన్న సామెత బొల్లినేనికి అక్షరాలా వర్తిస్తుంది.