ఆ స్కెచ్ ఆరునెలల తర్వాత కాని అర్థం కాదా?

తెలుగుదేశం పార్టీ లో ఒక చారిత్రక ఘట్టం రికార్డ్ కాబోతుంది. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ తో మైనే ప్యార్ కియా అనేందుకు టిడిపి సిద్ధపడింది. గత కొద్ది నెలలుగా దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు. టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ను ముందే కాంగ్రెస్ లోకి పంపి స్ట్రేటజీ ఏమిటో చెప్పక చెప్పేశారు బాబు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం రోజున రాహుల్ గాంధీ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు టిడిపి అధినేత.

అవసరాలను ముందే……

భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి తదనుగుణంగా అడుగులు పర్ ఫెక్ట్ గా వేయడం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎప్పుడో వేసిన స్కెచ్ ఆరునెలల తరువాత అందరికి అర్ధమయ్యేలా ఉంటాయి ఆయన వ్యూహాలు. తాజాగా తెలంగాణాలో మొదలైన కాంగ్రెస్ టిడిపి జర్నీ బాబు మాస్టర్ మైండ్ ను మరోసారి చాటిచెప్పింది.

క్యాడర్ కి బ్రెయిన్ వాష్ చేస్తున్న …

కాంగ్రెస్ తో వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్ళడంపై టిడిపి లో వున్న అసంతృప్తిని నెమ్మది నెమ్మదిగా దూరం చేస్తూ వస్తున్నారు తెలుగు దేశ అధినేత. రాహుల్ తీరు మారిందని పరిణతి చెందారని యుపిఎ గణనీయంగా మెరుగుపడుతుందంటూ పలు సందర్భాల్లో బాబు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక్కసారే క్యాడర్ ఈ కలయిక జీర్ణం చేసుకోలేరని అందుకే దశల వారి స్కీం కి శ్రీకారం చుట్టేశారు రాజకీయ చాణక్యుడు. అయితే ఎన్టీఆర్ కాలం నుంచి పసుపు పార్టీని అణువణువునా నింపుకున్న తమ్ముళ్ళు మాత్రం ఏపీలో ఇవే పరిణామాలు ఎదురైనప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారా ? లేక ఎన్టీఆర్ తోనే ఆ రోజులు పోయాయని సరిపెట్టుకుంటారా ? అన్నది వేచి చూడాలి.