టీడీపీకి షాకులు మీద షాకులే… !!

ఈ మధ్య కాలంలో విశాఖ, టీడీపీ న్యూస్ లో బాగా నలుగుతున్నాయి. ఏ నగరంతోనూ లేని బంధం విశాఖతో ఉందని చెప్పుకునే చంద్రబాబుకు విశాఖ తనదైన శైలిలో షాకులు ఇస్తోంది. దాంతో ఉలిక్కిపడడం పసుపు పార్టీ వంతవుతోంది. సరిగ్గా నెల రోజుల నుంచి విశాఖ పేరు వింటేనే టీడీపీ ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. దానికి అనేక కారణాలు ఉన్నా రాజకీయంగా ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని టీడీపీ తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు.

ఆ ఘటనతో అలా…

సరిగ్గా నెల రోజుక క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు దారుణంగా చంపేశారు. పట్టపగలు జరిగిన ఈ హత్య టీడీపీ సర్కార్ పరువు తీసేసింది. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ ని సైతం కాపాడుకోలేకపోయారన అపకీర్తి బాబు సర్కార్ కి ఏర్పడింది. ఈ ఘటనతో విస్తుపోవడం విశాఖ వాసులతో పాటు టీడీపీ నేతలదీ అయింది. మొత్తానికి దాని మీద సిట్ నివేదికను రప్పించుకుని ప్రభుత్వం తప్పేంలేదనిపించుకున్నారు. అయినా ఏజీన్సీలో టీడీపీ ఉనికి గాలిలో దీపంలాగానే ఉందిప్పుడు.

జగన్ పై హత్యాయత్నం….

ఆ ఘటన మరువక ముందే జగన్ పై హత్యా యత్నం టీడీపీకి పెను సవాల్ విసిరింది. ఈసారి ఏకంగా విపక్ష నాయకుడి ప్రాణాలే త్రుటిలో ప్రమాదం నుంచి బయట పడ్డాయి. అతి సురక్షితమైన విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఉందనుకున్న చోట ప్రతిపక్ష నాయకున్ని కాపాపడలేని అసమర్ధ ప్రభుత్వం ఏపీలో ఉందన్న సంకేతాలు జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాయి. ఇది నిజంగా తలవంపులు తెచ్చే పరిణామంగా మారిందంటున్నారు. దానికి తోడు పార్టీకి కూడా రాజకీయంగా ఇబ్బందులు కలిగించేలా జగన్ ఎపిసోడ్ మారిందని అంటున్నారు.

పెద్దాయన లేని లోటు…

టీడీపీకి విశాఖలో పెద్ద దిక్కుగా ఉండే ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి హటాన్మరణం కూడా పార్టీకి షాక్ లాంటిదే. దశాబ్దాలుగా విశాఖలో పార్టీని నడిపించే మూర్తి మరణించడం జీర్ణించుకోలేని పరిణామమే. ఆయనకు పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది, దీంతో టీడీపీకి అర్బన్ జిలాలో లోటు బాగా ఏర్పడింది. ఇలా విశాఖ ఒక్క నెల రోజుల్లోనే అధికార టీడీపీకి పలు షాకులను ఇస్తూ వస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన నగరం విశాఖని బాబు తరచూ చెబుతూంటే ఈ జిల్లానే ఇపుడు టీడీపీకి తలనొప్పులు తెస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా వ్యవధి లేని ఈ వేళ విశాఖలో పార్టీ పరువు, ఉనికి నానాటికీ తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరి దీనికి ఏ విధంగా మరమ్మతులు చేపడతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*