ఆయనకు విశ్రాంతి….కాని ఆ ఫ్యామిలీలో…..?

మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. అన్ని పార్టీలూ ఈ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా.. ప్రధానంగా వైసీపీ, టీడీపీల మ‌ధ్యే పోరు ఉధృతం అన్న అంశం అంద‌రూ అంగీకిస్తున్న విష‌యం. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ టికెట్లకు డిమాండ్ పెరిగింది. నేత‌లు ఒక‌రిని మించి మ‌రొక‌రు పోటీ ప‌డుతున్నారు. ఒక టికెట్‌కు ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గా ల్లో ఈ పోటీ మ‌రింత విస్తృతంగా ఉంది. ఒక్కొక్క టికెట్‌కు ఐదుగురు నుంచి ఆరుగురు వ‌ర‌కు పోటీలో ఉన్నారు. వీరికి తోడు ప్రస్తుతం రంగంలో ఉన్న నాయ‌కులు కొంద‌రు త‌ప్పుకొని త‌మ వార‌సుల‌ను తెరమీదికి తెస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఇక‌, తాము విశ్రాంతి తీసుకోవ‌డ‌మో లేక పార్టీకి ప‌నిచేయ‌డ‌మో నిర్ణయించుకుని త‌మ టికెట్లను మాత్రం త‌మ వార‌సుల‌కు కేటాయించాల‌ని కోరుతున్నారు.

గత ఎన్నికల్లో……

ఈ క్రమంలో టీడీపీ సీనియ‌ర్లు ముందు వ‌రుస‌లో ఉన్నారు. వీరిలో ప్రధానంగా చ‌ర్చకు వ‌స్తున్న క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ టీడీపీ ఫ్యామిలీ కేఈ. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప‌త్తికొండ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఈయ‌న వైసీపీ అభ్యర్థికి గ‌ట్టి పోటీ ఇచ్చి ప‌త్తికొండ నుంచి విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో ఈయ‌న ఫ్యామిలీకి మ‌రో టికెట్ కూడా ల‌భించింది. 2014 ఎన్నిక‌ల్లో ఇదే జిల్లా డోన్ నుంచి కేఈ రెండో సోద‌రుడు కేఈ ప్రతాప్ పోటీ చేశారు. అయితే, వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం ప్రజాప‌ద్దుల క‌మిటీ చైర్మన్‌గా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే, ఈయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని, గెలుపు గుర్రం ఎక్కాల‌ని త‌హ‌త‌హ లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేఈ ఫ్యామిలీ రెండు టికెట్లు కోరుతోంది.

గట్టి పోటీ ఉన్నప్పుడు కూడా…..

2009 ఎన్నిక‌ల్లోనూ జిల్లాలో టీడీపీ నుంచి సీట్ల కోసం గట్టి పోటీ ఉన్నప్పుడు కేఈ సోద‌రులు ఇద్దరూ విజ‌యం సాధించారు. ప‌త్తికొండ నుంచి పోటీ చేసిన కేఈ.కృష్ణమూర్తి విజ‌యం సాధించ‌గా, డోన్ నుంచి పోటీ చేసిన ఆయ‌న మ‌రో సోద‌రుడు కేఈ.ప్రభాక‌ర్ నాటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోట్ల సుజాత‌మ్మను ఓడించారు. ఇక సుదీర్ఘకాలంగా రాజ‌కీయాల్లో ఉంటూ వ‌స్తూ కురువృద్ధుడిగా పేరున్న కేఈ కృష్ణమూర్తి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను త‌ప్పుకొంటాన‌ని ఇప్పటికే ప్రక‌టించారు. అదేస‌మ‌యంలో త‌న కుమారుడు కేఈ శ్యాంబాబుకు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. దీనికి దాదాపుగా పార్టీ అధినేత చంద్రబాబు అడ్డు చెప్పే ప‌రిస్థితి లేదు. దీంతో ఆయ‌న స్థానంలో ఆయ‌న కుమారుడు శ్యాంబాబు ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గంలో సుడిగాలి ప‌ర్యట‌న ప్రారంభించారు.

డోన్…పత్తికొండ నియోజకవర్గాలు…

ఇక‌, డోన్ నుంచి కేఈ ప్రతాప్ కూడా రంగంలోకి దిగేందుకు స‌ర్వస‌న్నద్ధం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేఈ ఫ్యామిలీకి ఈ రెండు టికెట్లు ఖ‌రారయ్యాయ‌నే ప్రచారం జ‌రుగుతోంది. అయితే, ప్రత్యక్ష ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకొనే కేఈ త‌ర్వాత ఏం చేయ‌నున్నార‌నే ప్రశ్న ఉద‌యిస్తోంది. ఆయ‌న స్వతహాగా సౌమ్యశీలి, వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ కార్యక్రమాల‌పై ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా గ‌ట్టి ప‌ట్టు సంపాయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీకి సేవ‌లు అందిస్తారా ? లేక వ‌యో భారం వెంటాడుతోంది కాబ‌ట్టి ఇక‌, విశ్రాంతి తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*