“దేశం” చుట్టిన వీరుడు

కాంగ్రెసు వాళ్లు సాహసించ లేకపోతున్నారు. చంద్రబాబు చక్రం తిప్పేస్తున్నారు. రాహుల్ గాంధీని లైమ్ లైట్లోకి తేవడం ద్వారా ఏపీలో పాలిటిక్స్ ను పక్కా అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. 2014లో టీడీపీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎంతగా ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతటి తీవ్రతను బీజేపీ పైకి నెట్టేస్తున్నారు. మొత్తం సమీకరణలు మార్చడం ద్వారా కాంగ్రెసు పార్టీని అభయహస్తం చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెసు నాయకులు కుతకుతలాడుతున్నారు. అయినప్పటికీ దేశంలో విభిన్న శక్తులను కలిపేందుకు తప్పనిసరి అవసరంగా చంద్రబాబుకు చేయూతనిస్తున్నారు రాహుల్. ఇకపై బాబు వ్యూహం మూడు దశల్లో ఉండబోతోంది. దానిని అమలు చేసేందుకు ఈనెల 20 వ తేదీ నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు.

ప్రాంతీయంగా….

దేశంలో కీలకమైన రాజకీయ పక్షాలన్నిటితో చంద్రబాబు నాయుడికి సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్ సెక్యులర్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రకటన చేసినప్పుడు ముందుగా గుర్తుకొచ్చిన పేరు చంద్రబాబు నాయుడిదే. ఆయన రంగంలోకి దిగితే బాగుండునని కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. అటు కశ్మీర్ నుంచి ఇటు తమిళనాడు వరకూ భిన్న ప్రాంతీయపార్టీల నాయకులతో ఆయనకు నేరుగా పరిచయాలున్నాయి. గతంలో తృతీయఫ్రంట్ ను నడిపిన అనుభవమూ ఉంది. అందువల్ల కేసీఆర్ తో పోలిస్తే చంద్రబాబు బెటర్ ఛాయిస్ అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ కేసీఆర్ రెండు మూడు పర్యటనలతో హడావిడి చేశారు. అనుకున్నస్థాయిలో స్పందన లభించలేదు. ఫ్రంట్ యత్నాలు మూలనపెట్టేశారు. అప్పట్లో టీడీపీకి, టీఆర్ఎస్ తో సంబంధాలు సజావుగా ఉన్నాయి. టీడీపీ కేంద్ర మంత్రివర్గంలో ఉంది. దాంతో చడీచప్పుడు చేయకుండా ఉండిపోయారు. మారిన పరిస్థితుల్లో మళ్లీ చంద్రబాబు పాత్ర చర్చనీయమైంది. మోడీకి వ్యతిరేకంగా మూడో కూటమికి తెరతీస్తారని భావించారు. ఇది ఓట్ల చీలికకే తప్ప బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోదని చంద్రబాబు గ్రహించారు. దాంతో ప్రాంతీయ శక్తులను కలిపి కాంగ్రెసు నేతృత్వానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను రెండు నెలల కార్యాచరణను సిద్దం చేశారు.

రాష్ట్రాల వారీ…

మూడో ప్రత్యామ్నాయం మాట లేకుండా, కాంగ్రెసుకు దన్నుగా బీజేపీతో ముఖాముఖి తలపడేలా ప్రాంతీయశక్తులను సమాయత్తం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందుకుగాను రాష్ట్రాల వారీ అనుకూలించే శక్తుల సమీకరణకు పూనుకుంటున్నారు. శరద్ పవార్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ , మాయావతి వంటివారితో ఇప్పటికే తొలి దశ చర్చలు పూర్తిచేశారు. బీజేపీ పాతుకుపోతే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుందన్న దిశలో ఈ చర్చలు సాగాయి. దక్షిణ భారత దేశంలో ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు రాజకీయంగా కీలకం కాబోతున్నాయి. కేరళలో ఎలాగూ వామపక్షాల ప్రభుత్వం ఉంది. కాంగ్రెసు బలం పుంజుకొంటోంది. కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో డీఎంకేలు ఇప్పటికే యూపీఏకి ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు. ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్సులూ అంతే. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, బీజేడీ లను దారికి తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అదే జరిగితే ఒక బలమైన కూటమి ఏర్పాటైనట్లే. ఇందులో కొన్ని పార్టీలకు కాంగ్రెసుతో సత్సంబంధాలు లేవు. వాటిని ఒప్పించి, తాత్కాలికంగా ఎన్నికల వరకూ అయినా కలిసినడిచేట్లుగా చేయాలని భావిస్తున్నారు. 2019లో బీజేపీ ని బలంగా ఢీకొట్టాలనే ఉద్దేశంతోనే వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకుగాను రానున్న రెండు నెలలు రాష్ట్రాల వారీ పర్యటనలకు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. తన గత వైభవాన్ని, పరపతిని పెట్టుబడిగా పెట్టేందుకు సిద్దమవుతున్నారు.

పక్కా ప్రకటన…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తోంది. ఎంపీల నేత్రుత్వంలో సాగుతున్న ధర్మపోరాట దీక్షలన్నీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటూ చేపట్టినవే. వీటిలో ఎంపీలు, ముఖ్యమంత్రి పాల్గొని మోడీ పై ధ్వజమెత్తుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలను స్క్రీన్లపై ప్రదర్శించి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక వేదికలుగా పోరాట దీక్షలను తీర్చిదిద్దారు. వీటిని ఇకపై కేంద్రప్రభుత్వానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలుగా మార్చాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీని జనవరిలో ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి, ధర్మపోరాట దీక్షలో భాగంగా ప్రత్యేక బహిరంగ సభను నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సభలో ప్రత్యేకహోదా అంశంపై ప్రకటన చేయిస్తే రాజకీయ ప్రయోజనం దక్కుతుందని యోచిస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా టీడీపీకి మంచి మైలేజీ వస్తుంది. కాంగ్రెసుపై ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ప్రజల్లో తగ్గుతుంది. తెలంగాణ తరహాలో ఏపీలో సైతం కాంగ్రెసుతో పొత్తుకు మార్గం సుగమం అవుతుంది. దీంతో 2014 ను రిపీట్ చేయవచ్చనేది టీడీపీ అధినేత ఆశాభావం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*