సీటు ఇవ్వకుంటే..అంతేనట….!!

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో సీట్లు దక్కనివారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్‌ చేసేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ అస‌మ్మతి సెగ ఎక్కువగా ఉండగా ఇప్పుడు మహాకూటమితో సీట్లు దక్కని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం అధిష్టానానికి వార్నింగులు ఇవ్వడమో లేదా ఇతర పార్టీలోకి జంప్‌ చేసేయడమో చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల మూమెంట్‌ తెలంగాణ ఎన్నిక‌ల‌ తర్వాత ఏపీకి షిప్ట్‌ అవుతుండడంతో ఇక్కడ సైతం అదే పంథా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్లు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండడంతో ఫైన‌ల్‌గా సీటు ఎవరికి దక్కుతుందన్నది కాస్త ఉత్కంఠగానే ఉంది.

బాపట్ల స్థానంలో….

గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఏడెనిమిది మంది సీనియర్‌ లీడర్లు ఉన్నారు. వారి సీటుకు వచ్చిన డోకా లేకపోయినా పార్టీ వరుసగా ఓడిపోతున్న కొన్ని స్థానాల్లో ఆశావాహులు మాత్రం లెక్కకుమిక్కిలిగానే ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బాపట్ల విషయానికి వస్తే ఇక్కడ నుంచి టీడీపీ సీటు కోసం ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌తో పాటు వేగేశన ఫౌండేషన్‌ అధినేత వేగేశన నరేంద్రవర్మ, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి లేదా ఆయన తనయుడు గాదె మధుసూదన్‌ రెడ్డి టిక్కెట్‌ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ముగ్గురు మధ్య సీటు కోసం ట్రయాంగిల్‌ ఫైట్‌ నెలకొనడంతో పాటు ఇటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న అన్నం సతీష్‌ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా రేసులో ఉన్నారు.

టిక్కెట్ కోసం పోరు….

పార్టీ గత ఎన్నికల్లో ఓడినా ఆయన ఇన్‌చార్జ్‌గా ఉండడంతో అధికారులను గ్రిప్‌లో పెట్టుకుని నియోజకవర్గంలో పార్టీ పరంగా పెత్తనం చేస్తున్నారు. ఇటు వేగేశన ఫౌండేషన్‌ అధినేత వేగేశన నరేంద్రవర్మ కోట్లాది రూపాయిలు తన సొంత సొమ్మును వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో పాటు పార్టీని క్షేత్ర స్థాయిలోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి గడపను టచ్‌ చేస్తున్నారు. ఇందు కోసం ఆయన గ్రామ పలకరింపు.. ప్రతి ఇంటికి తెలుగుదేశం పేరుతో వినూత్నమైన కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్లున్నారు. టిక్కెట్‌ ఎవరికి వచ్చినా అటు అన్నం సతీష్‌ ఇటు వేగేశన నరేంద్రవర్మ ఇద్దరూ హోరాహోరీగా కష్టపడుతున్నారు. సతీష్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హోదా ప్లస్‌ అయితే ఇటు వర్మ సొంత ఫౌండేషన్‌తో పాటు తన సొంత విజన్‌తో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తుండడం ప్లస్‌.

గాదె తనయుడు కూడా….

వీరిద్దరితో పాటు టిక్కెట్‌ రేసులో తాను ఉన్నానని చెప్పుకుంటున్న గాదె వెంకటరెడ్డి తనకు లేదా తన కూమారుడు మధుసూదన్‌రెడ్డికి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. వాస్తవంగా చూస్తే గాదె తన సీనియార్టి ముందు పెట్టుకుంటున్నారే తప్ప నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం చేసిందేమి లేదన్నది బహిరంగ రహస్యమే. బాపట్ల టీడీపీ అభ్యర్థి ఎంపికలో ఈ సారి చంద్రబాబు అనేక ఈక్వేషన్లు ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చెయ్యనున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వరుసగా అభ్యర్థులను మారుస్తున్నా ఉపయోగం ఉండడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఆ తర్వాత పత్తా లేకుండా పోవడంతో క్షేత్ర స్థాయిలో బాపట్లలో టీడీపీ ఇప్పటికి బలపడలేదు. గతంతో పోలిస్తే ఈ సారి పరిస్థితులు ఇక్కడ భిన్నంగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

సరిగ్గా వ్యవహరిస్తే…..

ఈ సానుకూల‌త‌ను టిక్కెట్ ఆశించే నాయ‌కులు అనైక్యత లేకుండా సరిగ్గా క్యాష్‌ చేసుకుంటే బాపట్లలో ఈ సారి టీడీపీ గెలుపు అవకాశాలను కొట్టిపడేయలేము. జిల్లాల్లో ఎదో ఒక సీటును (గుంటూరు వెస్ట్‌) కాపులకు ఇచ్చిన పక్షంలో ఇక్కడ నుంచి అన్నం సతీష్‌కు ఛాన్స్‌ దక్కే అవకాశాలు లేవు. ఒకవేళ‌ రెడ్లకు ఈ సీటు ఇవ్వాలనుకుంటే గాదె ఫ్యామిలీకి దక్కుతుందా లేదా ఎవరికైనా ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. అలాగే కొత్త అభ్యర్థికి ఇవ్వాల‌నుకుంటే క్షత్రియ సామాజికవర్గానికి చెందిన‌ వేగేశన నరేంద్రవర్మే ఫస్ట్‌ ఆప్షన్‌. టీడీపీ సీటు ఫైటు హీటెక్కడంతో అన్నం సతీష్‌ ఇటీవల విలేకర్ల సమావేశం పెట్టి మరీ బాపట్ల సీటు నాదే అని ఓపెన్‌గా ప్రకటించుకున్నారు. అటు గాదె వెంకటరెడ్డి సైతం టిక్కెట్‌ రేసులో తాను ఉన్నానని తనకు లేదా తన వారసుడికి టీడీపీ సీటు ఇవ్వాలని ప్రకటించారు. ఏదేమైనా బాపట్లలో ఫైన‌ల్‌గా సీటు ఎవరికి దక్కినా టీడీపీ సీటు కోసం అప్రకటిత యుద్ధం అయితే మొదలైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*