రచ్చ రంబోలా…ఆగేట్లు లేదే…??

వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారికి కష్టాలు తప్పడం లేదు. పార్టీ వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఇస్తుందో లేదో నమ్మకమూ ఆనేతల్లో లేదు. చివరి క్షణంలో తమకు అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తే ఏం చేయాలని పాలుపోక అనేక మంది వైసీపీ ఎంపీలు ఇప్పటి నుంచే మధన పడుతున్నారు. ఇటు జగన్ పార్టీలోకి తిరిగి వెళ్లలేక, అటు పార్టీలో ఉన్నా టిక్కెట్ వస్తుందో? రాదో? నమ్మకం లేక ఉసూరుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన వారి పరిస్థిత ఏ మాత్రం బాగాలేదంటున్నారు.

టీజీ వర్సెస్ ఎస్వీ…

ముఖ్యంగా కర్నూలు టౌన్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి, టీజీ వెంకటేశ్ కు మద్య అస్సలు పడటం లేదు. టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ ఇప్పటికే విజన్ యాత్ర పేరిట కర్నూలు పట్టణంలో యాత్రను ప్రారంభించారు. అయితే దీనిపై ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పాదయాత్ర చేయడమేంటని నిలదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీజీ యాత్రను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారన్న వార్తలు వస్తున్నాయి.

లోకేష్ దృషికి తీసుకెళ్లిన….

దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు టీజీ వెంకటేశ్ పై ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో తిరుగుతూ తనపైనే టీజీ భరత్ విమర్శలు చేస్తున్నారని ఆయన కొన్ని సీడీలను కూడా పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంపీ బుట్టారేణుకు కూడా భరత్ పక్షాన వత్తాసు తీసుకున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి అంటూ బుట్టారేణుక ఇటీవల ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీనిపై ఆరాతీశారని తెలుస్తోంది.

త్వరలోనే గుడ్ బై చెబుతారా?

మరోవైపు కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి అక్కడ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న విష్ణు వర్థన్ రెడ్డి బాహాబాహీ తలపడుతున్నారు. ఇది పేరుకు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ ఇన్ ఛార్జి గా ఉన్న విష్ణువర్థన్ రెడ్డిదే పైచేయిగా ఉంది. ఎమ్మెల్యే మణిగాంధీని లెక్క చేయడం లేదు. ఒకదశలోతాను ఎందుకు పార్టీ మారానా? అని మణిగాంధీ వాపోయారు కూడా. దీంతో మణిగాంధీకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న అనుమానం బయలుదేరింది. సర్వేల ఫలితాల ప్రకారమే టిక్కెట్లు అని చెప్పిన చంద్రబాబు తనను పక్కన పెడతారేమోనన్న అనుమానం పట్టి పీడిస్తుంది. దీంతో ఇక శుభముహూర్తం చూసుకుని పసుపు పార్టీకి బైబై చెప్పాలని డిసైడయి పోయారన్న టాక్ ఉంది. మొత్తం మీద ఎన్నికలకు ఇంకా సమయంల ఉండగానే టిక్కెట్ల కోసం పంతాలు, పట్టింపులకు పోతున్నారు తెలుగుతమ్ముళ్లు. మరి చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*