బాబే రింగ్ మాస్ట‌ర్‌…..!

జాతీయ స్థాయిలో బీజేపీ వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటులో టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క పాత్ర పోషించ‌బోతున్నారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహం ర‌చిస్తున్నారా..? ఇందుకోసం ఆయ‌న ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో క‌లిసి గ్రౌండ్‌వ‌ర్క్ చేస్తున్నారా..? అంటే కొద్దిరోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. గ‌తంలోనూ జాతీయ స్థాయిలో కూట‌మి ఏర్పాటు, నిర్వ‌హ‌ణ‌లో చంద్ర‌బాబుకు అనుభ‌వం ఉండ‌డం, దేశంలోనే సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత కావ‌డంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎన్టీయే నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌నే ప్ర‌ధాని మోడీ గ్రాఫ్ క్ర‌మంగా ప‌డిపోతోంద‌ని ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు నిర్వ‌హించి స‌ర్వేల్లే తేలిన‌ విష‌యం తెలిసిందే.

జాతీయ స్థాయిలో బలంగా….

అంతేగాకుండా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా బీజేపీ మోసం చేసింద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు జాతీయ స్థాయిలో బ‌లంగా వినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అన్నివిప‌క్షాల‌ను ఒప్పించి, కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌భుత్వాన్ని కూల్చే బ‌లం లేకున్నా.. స‌భ‌లో ప్ర‌ధాని మోడీ పాల‌న‌ను ఎండ‌గ‌ట్టే అవ‌కాశం మాత్రం చంద్ర‌బాబుతోనే వ‌చ్చింద‌న్న విష‌యం విప‌క్ష నేత‌ల్లో ఉంది. అంతేగాకుండా.. మొన్న జ‌రిగిన రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లోనూ విప‌క్షాల కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కాంగ్రెస్ నేత‌కు టీడీపీ మ‌ద్ద‌తు తెలిపింది. ఆ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ నేత‌కే ఓట్లు వేసిన విష‌యం తెలిసిందే.

బీజేపీని ఓడించడమే…..

దీనిని బ‌ట్టి.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేసిన బీజేపీని ఓడించ‌డ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పావులు క‌ద‌పుతున్నార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీల‌కు వ్య‌తిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ చివ‌ర‌కు అదే బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఎన్డీయేలో కొన‌సాగుతున్న జేడీయూ అభ్య‌ర్థికి మొన్న‌టి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ మ‌ద్ద‌తు తెలిపారు. ఇక ఇటీవ‌ల కొద్దిరోజుల వ్య‌వ‌ధిలోనే ప్ర‌ధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయిన విష‌యం తెలిసిందే. దీంతో మోడీ, కేసీఆర్ క‌లిసిపోయార‌నే టాక్ కూడా వ‌చ్చింది. కేసీఆర్ క‌ద‌లిక‌ల‌తో కంగుతున్న తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ, జేడీఎస్ నేత‌లు దేవెగౌడ‌, సీఎం కుమార‌స్వామి, డీఎంకే నేత‌లు స్టాలిన్ ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ త‌న ఉనికి చాటుకునేందుకు త‌ర‌చూ మోడీతో భేటీ అవుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

సంప్రదింపుల్లో బాబు…..

ఇక ఇదే స‌మ‌యంలో బీజేపీ వ్య‌తిరేక కూటమి ఏర్పాటుకు చంద్ర‌బాబు కీల‌క పాత్ర‌పోషించాల‌ని మ‌మ‌త‌, కుమార‌స్వామి, స్టాలిన్ త‌దిత‌ర ప్రాంతీయ పార్టీల నేత‌లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన క‌ర్నాటక ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి బాబుతో భేటీ అయి.. బీజేపీని ఓడించ‌డ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, ఎన్‌సీపీ త‌దిత‌ర ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో చంద్ర‌బాబు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు రంగంలోకి దిగ‌డంతో ఇక సీఎం కేసీఆర్ వైపు మొగ్గుచూపేవారే క‌రువ‌య్యార‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఇలా ప్రాంతీయ పార్టీల నేత‌లంద‌రూ చంద్ర‌బాబు వైపు వ‌స్తున్న త‌రుణంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి మ‌రి.