బాబు..భయం..మళ్లీ అదే జరుగుతుందనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సై అనడం లేదు. బీజేపీతో సంబంధాలు తెగిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఏపీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. గతంలో ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకు అచ్చిరాకపోవడం ఒక కారణమైతే, అభివృద్ధి పనులు నిలిచిపోతాయని ఆయన భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అందుకే ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది.

ఎనిమిది నెలల ముందు అంటే…..

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చే ఏడాది జూన్ 18వరకూ గడువు ఉంది. ముందస్తు ఎన్నికలు జరిగితే ఈ ఏడాది నవంబరు, డిసెంబర్ లలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఎనిమిది నెలల సమయాన్ని ప్రభుత్వం కోల్పోవాల్సి ఉంటుంది. ఇందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. 2004లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమపాలయిన సంగతి చంద్రబాబుకు ఇంకా గుర్తుండే ఉంటుంది. అందుకోసమే ఆయన ముందస్తు ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా సంకేతాలిచ్చారు.

అభివృద్ధి పనులు…..

మరోవైపు పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ఒక రూపురేఖలు వచ్చే అవకాశం ఉంది. ఆరు నెలల్లో అమరావతిలో ఒక భవనం నిర్మిత మవుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. గత నాలుగేళ్లుగా అమరావతిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదన్న విపక్షాల విమర్శలను నోళ్లు మూయించేందుకు ఆ పనులు వేగవంతంగా జరగాలని చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏడు నెలల ముందుగానే ఎన్నికలకు వెళితే ఆ ప్రతిఫలం దక్కకపోవచ్చన్నది బాబు ఆలోచన. దీంతో పాటు పోలవరం నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుండటంతో ఏడునెలల్లో అది కూడా ఒక కొలిక్కి వస్తుందని బాబు భావిస్తున్నారు.

ఓటు బ్యాంకును పటిష్ట పర్చుకునేందుకు…..

దీంతో పాటు పార్టీ శ్రేణులు సమాయత్తం చేయడానికి, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ ఏడు నెలల సమయం చాలునని చంద్రబాబు అనుకుంటున్నారు. నిరుద్యోగ భృతిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది. అవి యువతకు అంది వారు సంతృప్తి పూర్తి స్థాయిలో చెందాలని, యువత ఓటు బ్యాంకును చేజిక్కించుకోవాలస్నది బాబు వ్యూహం. ముందస్తుకు వెళితే ఇది సాధ్యంకాకపోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా చంద్రబాబు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు.