వియ్ వాంట్ క్లారిటీ రైట్ నౌ….!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు పొత్తులపై తేల్చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ రానున్నారు. నందమూరి హరికృష్ణ దశదిన కర్మ సందర్భంగా ఆయన హైదరాబాద్ రానున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ అవుతారు. వారితో చర్చించిన తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలసి వెళ్లాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా పొత్తు చర్చలు ప్రారంభమయినట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బలహీన పడిపోయిన తెలుగుదేశం పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని మూడు నెలల ముందే తీసుకుంది.

మొన్నటి వరకూ……

కాని ఏ పార్టీతో వెళ్లాలన్నది అప్పటికి క్లారిటీ లేదు. అయితే జాతీయ రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు కాంగ్రెస్ తోనే కలసి వెళ్లాలన్నది దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణ టీడీపీనేతలతో సమావేశం నామమాత్రమే. ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను కూడా చంద్రబాబు తీసుకోనున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నారు. విభజన జరిగి, చంద్రబాబు అమరావతికి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ పెద్దగా నాయకులు కూడా లేరు. క్యాడర్ మాత్రం ఉందని నాయకత్వం నమ్ముతోంది. గత ఎన్నికల్లో 15 సీట్లు రావడంతో తమ బలం తగ్గలేదని, నేతలే వెళ్లారని, ఓటు బ్యాంకు అలానే ఉందని చంద్రబాబుకూడా బలంగా విశ్వసిస్తున్నారు. కానీ ఇక్కడ పార్టీకోసం సమయం వెచ్చించలేని పరిస్థితి చంద్రబాబుది.

కాంగ్రెస్ తో తప్పదు……

అందుకోసమే పొత్తులతోనే వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చేసారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాము ఒంటరిగానే వెళుతున్నట్లు ప్రకటించారు. పైగా చంద్రబాబు, తెలుగుదేశంపై ఫైర్ అయ్యారు కూడా. బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీయే. అందుకోసమే కాంగ్రెస్ తో సీట్ల ఒప్పందం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ 25 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంటు స్థానాలను కోరుతుంది. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలను కోరుతుంది. అలాగే ఖమ్మం, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలను కూడా తమ జాబితాలో చేర్చింది.

చర్చల కోసం కమిటీలు….

అయితే కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అన్నదే ప్రశ్న.కాంగ్రెస్ 15 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు సమన్వయ కమిటీని వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో సంప్రదింపుల కోసం మధుయాష్కీ, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజులను నియమించింది. ఈరోజు చంద్రబాబు కూడా కాంగ్రెస్ తో చర్చించేందుకు ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీయే చివరిదాకా కాంగ్రెస్ తో సంప్రదింపులు కొనసాగించనుంది. సీట్ల విషయంలో కొంత తగ్గైనా పొత్తుతోనే వెళ్లాలన్నది చంద్రబాబు నిర్ణయంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.