బాబుకు ఛాన్స్ మిస్సయిందే….!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి కొత్త చిక్కు వచ్చిపడేటట్లుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు ప్రధానశత్రువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నది అందరికీ తెలిసిందే. రేపటి ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీకి ఉంటుంది. చంద్రబాబు దాదాపు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జగన్ పార్టీ ఇప్పటి వరకూ అధికారంలోకి రాలేదు. అయితే దశాబ్దకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబు ఇప్పటి వరకూ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. నీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి వివిధ ప్రాంతాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రద్ధచూపలేదని, అవినీతికి పాల్పడిందని చంద్రబాబు ఆరోపిస్తూ వస్తున్నారు.

ఇప్పటి వరకూ వైఎస్ పై….

వైసీపీ అధినేత జగన్ ఇప్పటి వరకూ అధికారంలో లేకపోవడంతో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనపై చంద్రబాబు విమర్శలు చేస్తూ కథ నడిపేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈక్వేషన్లు పూర్తిగా మారాయి. దేశంలో మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటవుతోంది. అందులో చంద్రబాబు బిజీగా ఉన్నారు. అలాగే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుతో ఎన్నికల గోదాలోకి దిగారు. ఇక ఏపీ ఎన్నికల విషయానికొస్తే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కాంగ్రెస్ తో ఏపీ ఎన్నికల్లోనూ కలసి వెళ్లాలన్నదే బాబు వ్యూహం. ఆ పార్టీకి ఉండే కొంత శాతం ఓటు బ్యాంకుతోనయినా తాను గట్టెక్కగలనన్న ధీమాతో బాబు ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

పోలవరం ప్రాజెక్టు…..

అయితే ఇక్కడే సమస్య వచ్చిపడింది. పోలవరం ప్రాజెక్టు తీసుకున్నా…వెలుగొండ ప్రాజెక్టు తీసుకున్నా తొలుత చంద్రబాబు విమర్శించేది కాంగ్రెస్ ను మాత్రమే. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని పట్టించుకోలేదని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఇప్పటికీ తీవ్రవిమర్శలు చేస్తుంటారాయన. ముఖ్యంగా వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను తాను పూర్తిచేస్తున్నానని, నిధులు వెచ్చించారేకాని నీళ్లు పారలేదని ఎద్దేవా చేస్తుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఈ విమర్శలకు బాబు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.వైఎస్ ను విమర్శిస్తే కాంగ్రెస్ నేతలు అంగీకరించరు. కాంగ్రెస్ తో జతకట్టి ఆ పార్టీని విమర్శించే పనికి పూనుకోరన్నది పరిశీలకుల భావన.

మోదీనే ప్రధాన టార్గెట్…..

మరోవైపు జగన్ పైనే విమర్శలు చేయాల్సి ఉంది. జగన్ పై ప్రత్యేకించి చేయాల్సిన విమర్శలేవీ ఆయన వద్ద లేవు. ఇప్పటికే గత ఎన్నికలలో అవి వాడేశారు. జగన్ పై సీబీఐ కేసులపైనే ఆయన ప్రధానంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. సో.. ఇక చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీని మాత్రమే విమర్శిస్తూ ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. జగన్, పవన్, బీజేపీ లోపాయికారీ ఒప్పందం ఇక షరామామూలే. సో మోదీని టార్గెట్ గా చేసుకుంటూనే చంద్రబాబు పనికానిచ్చాల్సి ఉంది. ఏది ఏమైనా పదేళ్ల కాంగ్రెస్ పాలనపై ఇప్పటి వరకూ అవినీతి ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇక ఆ జోలికి వెళ్లరన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో విన్పిస్తున్న టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*