లీడర్లు ఓకే…మరి క్యాడర్…??

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల తీసుకున్న నిర్ణయం కిందిస్థాయి క్యాడర్ ను విస్మయానికి గురిచేసింది. నిజానికి చెప్పుకోవాలంటే నేతల మాట ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఎన్టీ రామారావుకు వీరాభిమానులు. ఎన్టీఆర్ అంటే పడి చచ్చేవారే. ఎన్టీఆర్ స్థాపించిన ఆ పార్టీని తమ ఇంటి పార్టీగా నమ్మే కార్యకర్తలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లక్షల సంఖ్యలో ఉంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈనెల 1వ తేదీన చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. చంద్రబాబు తాను తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకూ ముఖ్య నేతలకు కూడా చెప్పలేదు. ఢిల్లీ స్థాయిలో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసే నేతలకు, సీనియర్ నేతలకు తప్ప కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా రాహుల్ తో భేటీ విషయం తెలియదంటే ఆశ్చర్యంలేదు.

చెప్పే ప్రయత్నం చేసినా…..

అయితే ఆ తర్వాత చంద్రబాబు తాను రాహుల్ ను ఎందుకు కలిసిందీ చెప్పేందుకు క్యాడర్ కు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నాలు చేశారు. విపక్షాలు ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారంటూ విమర్శలు చేస్తుండటం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్ నమ్ముతుండటంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. తాను జాతీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ తో జట్టుకట్టానని, అందులో రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ తనకు స్వయంగా చెప్పడాన్ని కూడా టెలికాన్ఫరెన్స్ లో సవివరంగా చంద్రబాబు చెప్పారు.

రిలేషన్ షిప్ పై…..

కానీ నేతలు కాంగ్రెస్, టీడీపీ రిలేషన్ షిప్ పై టీడీపీ సీనియర్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ క్యాడర్ లో ఉన్న అనుమానాలను తొలగించలేకపోయాయమని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ తో ఎందుకు జత కట్టాల్సి వచ్చిందీ పూర్తిస్థాయిలో తెలిపాలని నిశ్చయించుకున్నారు. ఇందుకు కరపత్రాలను సిద్ధం చేస్తున్నారు. అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది? ఎన్టీఆర్ ఆశయాలు ఏంటి? సిద్ధాంతాలు ఏంటి? అనే విషయాలను కరపత్రాల ద్వారా తెలియజెప్పి క్యాడర్ లో కన్ఫ్యూజన్ పొగొట్టాలని బాబు భావిస్తున్నారు. కార్యకర్తలే తన ప్రాణమంటూ పదే పదే చెప్పే చంద్రబాబు ఆ కార్యకర్తల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు.

కరపత్రాలు, టెలికాన్ఫరెన్స్…..

కరపత్రాలతో పాటుగా చంద్రబాబు ఇకపై మంగళ, బుధవారాలు పార్టీ కోసం కేటాయించాలని నిర్ణయించారు. ఈరెండు రోజుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. బుధవారం ఖచ్చితంగా కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తెలుగుదేశం పార్టీ విధానపరమైన నిర్ణయాలను తెలియజెప్పాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి మంగళవారం నేతలతో జిల్లాల వారీగా సమావేశమై అక్కడ ఉన్న విభేదాలను తొలగించడంతో పాటు, పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక బుధవారం మాత్రం కేవలం క్యాడర్ కు మాత్రమే కేటాయించాలని బాబు భావిస్తున్నారు. పార్టీకి పునాదిరాళ్లగా ఉన్న క్యాడర్ కు ప్రతి విషయాన్ని తానే స్వయంగా చెప్పాలని బాబు నిర్ణయించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*