ఇదేం టెక్నిక్ బాబూ…??

జాతీయ స్థాయిలో చంద్రబాబు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో పడ్డారంటూ ఆపార్టీ అనుకూల వర్గం మీడియా పదే పదే వార్తలను ప్రసారం చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం కావచ్చు. కానీ ఆయన ఇటీవల జరిపిన పర్యటనలను చూస్తుంటే ఆయన కొత్తగా ఏకం చేసేది ఏముంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. తొలుత చంద్రబాబునాయుడు ఢిల్లికి వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అక్కడే ఫరూక్ అబ్దుల్లాను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలసి నలభై నిమిషాలు పాటు చర్చలు జరిపారు.

బాబు కలిసేవాళ్లంతా….

ఇక నిన్న జనతాదళ్ ఎస్ దళపతి దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలసి వచ్చారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా కట్టాల్సిన కూటమిపై చర్చించారు. అలాగే నేడు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అధినేత స్టాలిన్ ను కూడా కలవనున్నారు. అయితే ఇక్కడ అర్థం కానిది ఒక్కటే. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు విపరీతంగా శ్రమిస్తున్నారని ఒకవర్గం మీడియా హోరెత్తిస్తుంటే….వాళ్లంతా కాంగ్రెస్ అనుకూలురే కదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

కర్ణాటకలో ఇటీవలే…..

శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్సీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు చర్చలు దాదాపుగా ప్రారంభమయ్యాయి. ఇక కర్ణాటక విషయానికొస్తే మూడు రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేశాయి. రెండు పార్టీల నేతలు సంయుక్తంగా ఒకే వేదికపై పాల్గొని బీజేపీకి చెమటలు పట్టించారు. ఫలితంగా ఉప ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా నాలుగుస్థానాలు ఆ రెండు పార్టీలే గెలుచుకున్నాయి. కొత్తగా చంద్రబాబు వెళ్లి సాధించేదేంటని నెటిజన్లు సోషల్ మీడియాలో సూటి ప్రశ్నలు వేస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సయితం జేడీఎస్, కాంగ్రెలు కలసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొలువై ఉంది.

స్టాలిన్, మమతలు కూడా……

ఇక స్టాలిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్టాలిన్ గత కొంతకాలంగా తమిళనాడులో గవర్నర్ తీరును తప్పుపడుతూనే ఉన్నారు. అన్నాడీఎంకేకు బీజేపీ లోపాయికారీగా సహకారం అందిస్తుందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ తో కలసి కూటమి ఏర్పాటుకు కూడా స్టాలిన్ చర్చలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ను కలసి ప్రయోజనమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. కర్ణాటక, తమిళనాడు పర్యటనల అనంతరం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ వెళ్లి మమత బెనర్జీని కూడా కలవనున్నారు. మమత ఎప్పటి నుంచో బీజేపీ వ్యతిరేక గళం విన్పిస్తున్నారు. మరి వీళ్లంగా కాంగ్రెస్ కు అండగా ఉన్నవారే. చంద్రబాబు కొత్తగా సాధించిందేంటని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. కేవలం రాష్ట్రంలో తన పాలనలో ఉన్న లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికే ప్రజలను జాతీయ రాజకీయాలవైపు మళ్లించడానికే ఈ ఎత్తుగడ అని విమర్శలు చేస్తున్న వారూ లేకపోలేదు. నిజమే కదా…? కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న వారిని కలసి చంద్రబాబు కొత్తగా తెచ్చే మార్పు ఏంటో ఎవరికీ అర్థం కావడంలేదు. అది ఒక్క చంద్రబాబుకే తెలుసులా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*