ఆ సామాజిక వర్గం ఎటువైపో !!

రాజకీయ పార్టీలకు గెలుపు ముఖ్యం. అందుకోసం వారు అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తారు. అందులో మొట్ట మొదటిది కులపరమైన సమీకరణలు. ఎక్కడ ఏ కులం బలంగా ఉంది. ఆ కులం ఓట్లు ఎలా తీసుకోవాలి అన్న అంశంపైనే రాజకీయ పార్టీలో ఆలోచనలు ఉంటాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో మత్స్యకార సామాజికవర్గాన్ని నెత్తిన పెట్టుకుని పలు హామీలు గుప్పించిన తెలుగుదేశం ఇపుడు ఎన్నికలు సమీపిస్తున్నా వాటిని నెరవేర్చలేదు. దాంతో ఆ మధ్యన వారంతా కొన్ని రోజుల పాటు ఆందోళను నిర్వహించారు.

ఎస్టీలో చేరుస్తామని హామీ….

తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎస్టీ కేటగిరిలో చేరుస్తామని 2013లో పాదయాత్ర సందర్భంగా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం మీటింగులో హామీ ఇచ్చారు. దాంతో మత్యకారులంతా ఆ పార్టీకి మద్దతుగా నిలిచాయి. అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడచినా హామీ నెరవేరకపోవడంతో ఆ మధ్యన వారంతా రోడ్డు పైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. శ్రీకాకుళంలో అయితే నెలల తరబడి నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇటు విశాఖలోనూ ధర్నాలు చేపట్టారు. ఆ తరువాత వారంతా విశాఖ వచ్చిన చంద్రబాబుని కలిస్తే ఆయన హామీ మాట దేముడెరుగు ఆందోళనకారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.

మండిపోతున్న ఆ వర్గం…

ఆ తరువాత మత్య్సకారుల శిబిరానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీని నెరవేరుస్తామని చెప్పిన మీదట ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ఆ ఊసు ఎత్తకపోవడంతో పాటు మళ్ళీ ఎన్నికలు కూడా వస్తున్నందున ఇపుడు ఆ వర్గం రాజకీయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎస్టీలో చేరిస్తే వారికే ఓటు వేస్తామని మత్స్యకారులు స్పష్టంగా చెబుతున్నారు.

ఆ పార్టీలు ఏమంటాయో…

టీడీపీ మోసం చేసింది కాబట్టి నమ్మమని కూడా అంటున్నారు. జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నందున ఆయన నుంచి హామీ పొందాలని కూడా చూస్తున్నారు. మరో వైపు జనసేన స్పందన కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని కనీసం అరడజను అసెంబ్లీ సీట్లలో మత్స్యకారుల ప్రభావం గట్టిగా ఉంటోంది. అందువల్ల ఆ వర్గం ఆగ్రహానికి గురైతే గెలుపు కష్టమే. మరి దీనికి విరుగుడు మంత్రంగా టీడీపీ ఏం చేస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*