అంత ధైర్యం బాబు చేస్తారా?

వ‌చ్చే ఎన్నిక‌లు ఏపీలో రెండు ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. గెలుపు నీదా-నాదా అనే రేంజ్‌లో ఏపీలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ మధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం సాగ‌నుంది. ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌తో దూసుకు పోతున్నారు. ప్ర‌జ‌ల‌ను త‌న‌దైన శైలిలో త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో అధికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ ఆయ‌న సెంటిమెంట్‌గానే వినియోగిం చుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు.

జగన్ హవాకు తోడు…..

ఇక‌, తాజాగా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. చంద్ర‌బాబుకు 2019 ఎన్నిక‌ల్లో గెలుపు త‌ప్ప‌నిస‌రి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మికి బీజేపీ కాచుకూని కూర్చొంది. ఇక ఏపీలో ముక్కోణ‌పు పోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌వాకు తోడు .. జ‌న‌సేనాని ప‌వ‌న్ దూకుడు కూడా బాగానే ఉండేలా ఉంది. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా మునుపుఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో టికెట్ ఆశించి భంగ ప‌డిన వారికి నిర్మాణాత్మ‌క శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చి పార్టీలో రెబ‌ల్‌గా మార‌కుండా కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఓ పట్టాన తేల్చరని…

చంద్ర‌బాబు అంటేనే టిక్కెట్ల విష‌యాన్ని ఓ పట్టాన తేల్చ‌రు. రేపు బీఫామ్ చేతికి ఇచ్చే ముందు కూడా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు కొలిక్కిరారు. ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు జిల్లాలో మాచ‌ర్ల‌, మంగ‌ళ‌గిరి, బాప‌ట్ల‌, గుంటూరు తూర్పు లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త మూడు ఎన్నిక‌లుగా ఇదే తంతు న‌డుస్తోంది. అందుకే అక్క‌డ టీడీపీ వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇలా కాకుండా ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదే విష‌యాన్ని తాజాగా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కూడా ధ్రువీక‌రించారు. రాబోయే ఎన్నికలకు నాలుగు నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాడినికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకు మాత్ర‌మే టికెట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు.

ఆశావహుల్లో పండగ……

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి అంకిత భావంతో సేవ చేసిన వారికి అన్యాయం జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని కూడా ప్ర‌త్తిపాటి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఎన్నిక‌ల‌కు ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం అనేది నూత‌న సంస్కృతి కాద‌ని, పార్టీ వ్యూహాన్ని ఎన్నిక‌ల‌కు అనుగుణంగా మార్చుకోవ‌డంలో త‌ప్పులేద‌ని మంత్రి స‌మ‌ర్ధించుకున్నారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న పార్టీలో టికెట్ ఆశావ‌హుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నింపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*