మైండ్ బ్లాంక్ చేస్తున్నాడ్రోయ్..!!!

nara lokesh government advertisements

తండ్రిని మించిన త‌న‌యుడు అనిపించుకోవాల‌నే ఆతృత ఉండటం స‌హ‌జ‌మే! కానీ ఏపీలో మాత్రం తండ్రీ, కొడుకులు.. ఒక‌రిని మించి ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా తండ్రి సీఎం అయిన‌ప్పుడు.. కొడుకు ఆయ‌న కేబినెట్‌లో మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్పుడు ఈ పోటీ మ‌రింత అధికంగా ఉంటుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధిలో ఇద్దరూ పోటీప‌డితే ఫ‌ర్వాలేదు గానీ.. ప్ర‌చారంలో కూడా ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేశ్ పోటీ ప‌డుతుండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. ఒక‌ప‌క్క శంకుస్థాప‌న‌లు, ఇత‌ర కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌చారంలో చంద్ర‌బాబు ముందంజ‌లో ఉంటే.. ఇప్పుడు లోకేశ్ కూడా అదే అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్నారు. మిగిలిన మంత్రులంద‌రినీ డామినేట్ చేస్తూ.. త‌న శాఖ‌లో జ‌రిగిన అభివృద్ధి గురించి ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్మయానికి గురిచేస్తోంది.

తనని తాను ప్రమోట్…..

త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకునే ప‌నిలో బిజీబిజీగా ఉన్నారు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌! మంత్రులెవ‌రూ త‌న దరిదాపుల్లో లేర‌ని నిరూపించ‌డానికి లోకేశ్ ప్ర‌య‌త్నిస్తున్నారా? త‌న శాఖ‌లో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంద‌ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌డానికి అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఒక‌ప‌క్క చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు రెడీ చేస్తుంటే.. రాష్ట్రంలో త‌న‌ను తాను ప్ర‌చారం చేసుకునే ఆతృత‌లో ఉన్నారు లోకేశ్‌. అంతేగాక కేబినెట్‌లో సూప‌ర్ మ్యాన్‌లా స‌క్సెస్ సాధించాన‌ని చెప్పుకొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అందరి కంటే వెనక మంత్రి పదవి చేపట్టిన ఆయ‌న‌.. సీనియ‌ర్లు కూడా ఆశ్చ‌ర్య‌పోయేలా దాటిపోయాన‌ని చెప్పుకోవ‌డంపై తోటి మంత్రులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

టీవీల్లో ప్రకటనలు….

ఇప్పటి వరకూ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వం ప్రకటనలు ఇఛ్చింది కానీ.. ఒక మంత్రి ఏకంగా తన శాఖ విషయాలను.. తాను సాధించిన ప్రగతిని వివరిస్తూ టీవీల్లో ప్రకటనలు ఇవ్వటం చాలా అరుదైన విషయంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎవరైనా మంత్రి శాఖలో కీలక ఘట్టం జరిగితే అందులోనూ సహజంగానే సీఎం ఫోటోతోపాటు మంత్రి ఫొటో కూడా ఉంటుంది. కానీ ఏకంగా నారా లోకేష్ మంత్రి ఉన్నపంచాయతీరాజ్ శాఖలో మాత్రం ప్ర‌చారం వేరే లెవ‌ల్‌లో ఉంది. `నేను ఇన్ని రోడ్లను అభివృద్ధి చేశాను. ఇన్ని రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దాను` అంటూ టీవీల నిండా యాడ్స్ ఇస్తున్నారు చిన‌బాబు. ఇదే ఇప్పుడు మంత్రుల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

ఆయనకే ప్రత్యేకం…..

ఈ `ప్రత్యేక యాడ్స్` సౌకర్యం ఒక్క లోకేష్ కు మాత్రమే ఎందుకు ఇఛ్చారు? మేము ఈ నాలుగున్నరేళ్ల‌లో మా శాఖల్లో పనిచేయలేదా? ఒక్క లోకేష్ మాత్రమే సక్సెస్ ఫుల్ మంత్రా? మాకు ప్రచారం అవసరం లేదు? ఒక్క లోకేష్ చేసుకుంటే చాలు అని చంద్రబాబు భావిస్తున్నారా? అని మంత్రుల ప్ర‌శ్నిస్తున్నారు. లోకేష్ తన సొంత ప్రచారం కింద చెప్పుకునే గ్రామీణ రోడ్ల అభివృద్ధి పనులు ఎక్కువ శాతం చేపట్టింది కేంద్ర నిధులతోనే. కానీ అసలు కేంద్రం నిధులే ఇవ్వలేదని చెబుతూ ఇప్పుడు అదే నిధులతో చేపట్టిన రోడ్ల పనులను తన ఖాతాలో వేసుకుని `ప్రత్యేక ప్రకటనలు` ఇచ్చుకోవ‌డం కొస‌మెరుపు అని ఎద్దేవా చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*