ఇక లోకేష్ దే “కీ” రోల్ …?

తెలంగాణ రాజకీయ వ్యవహారాలను ఆంధ్రా నుంచే చంద్రబాబు తనయుడు లోకేష్ నడిపించనున్నారా …? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే కాంగ్రెస్ తో పొత్తు అనంతరం లోకేష్ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. ఏపీలో రాబోయే ఎన్నికలు టిడిపికి చావో రేవో అన్నట్లుగా పరిస్థితి నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పాతుకుపోవాలంటే ఆంధ్రప్రదేశ్ లో సత్తా చాటాలిసిన అవసరం వుంది. తెలంగాణ పాలిటిక్స్ పై పెదబాబు దృష్టి పెడితే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే పార్టీ సీనియర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాలపై బాగా పట్టున్న చినబాబుకు వాటిని అప్పగిస్తారని తెలుస్తుంది. పైకి తెలంగాణ శాఖకు అధికారాలు కట్టబెట్టమని చెబుతున్నా లోకేష్ పర్యవేక్షణలోనే అన్ని సాగుతాయని అంటున్నారు.

అందుకేనా చినబాబు రెచ్చిపోయింది…?

చాలా కాలంగా టి పాలిటిక్స్ పై మౌనంగా వున్న లోకేష్ తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తూ కెసిఆర్ గవర్నర్ ను కలవగానే అమరావతిలో మీడియా వద్ద చిట్ చాట్ పెట్టి ఫైర్ అయ్యారు చినబాబు. అది కూడా నేరుగా కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా టి ఎన్నికలకు టిడిపి చినబాస్ కు ట్రయిల్ రన్ గా చంద్రబాబు బాధ్యత పెట్టడం వల్లే అన్నది టాక్. అయితే గత భాగ్యనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ బాధ్యతలను లోకేష్ వహించారు.

ఓనమాలు నేర్చుకుంటూ…..

కానీ ఫలితం బెడిసికొట్టింది. ఆ ప్రభావం చినబాబు పై పడకుండా అమరావతికి రప్పించారు చంద్రబాబు. ఆయన్ను ఎమ్యెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి తనవద్దే రాజకీయ ఓనమాలు నేర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు కెసిఆర్ అండ్ కేటిఆర్ టీం తో నేరుగా కాకుండా చినబాబు పరోక్ష యుద్ధం ఎపి నుంచే మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో రాబోయే ఎన్నికల ఫలితాలు తేల్చేయనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*