గెలుపు కాదు… మెజారిటీయేనా…??

nara-lokesh-managalagiri-constiuency

మంత్రి నారాలోకేష్ మంగళగిరి నియోజకవర్గానికే పరిమితమవుతారా? ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉండవా? రాష్ట్రంలో పర్యటించి తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లాల్సిన నారా లోకేష్ కేవలం మంగళగిరిలోనే ఉంటున్నారు. మంగళగిరిలో వాడ వాడలా తిరుగుతున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారయిన దగ్గర నుంచి ఆయన మిగిలిన పార్టీ విషయాలేవీ పెద్దగా పట్టించుకోలేదు. మంగళగిరిలో గెలవడమే లక్ష్యంగా ఆయన చెమటోడుస్తున్నారు. గత ఐదు రోజుల నుంచి నారా లోకేష్ ప్రచారం చూస్తుంటే ఇదే అర్థమవుతుంది.

మంగళిగిరిని వదలకుండా….

నారాలోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. భవిష్యత్తులో ఆయనే పార్టీకి పెద్దదిక్కు. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం. ఒకపక్క టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోజుకు ఆరు సభల్లో ప్రసంగిస్తూ అలుపెరగకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం ను పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను చుట్టేసి వస్తున్నారు. నారా లోకేష్ మంత్రి పదవి చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలు చేశారు. కొన్ని జిల్లాల పర్యటనల్లో లోకేష్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో నేతల మధ్య మరింత వివాదం తలెత్తింది.

జిల్లా పర్యటనలు లేనట్లేనా?

ఈ పరిస్థితుల్లో లోకేష్ ను జిల్లాలను తిప్పడం కంటే మంగళగిరి వరకే ప్రచారానికి పరిమితం చేయడం మంచిదని చంద్రబాబునాయుడు భావించినట్లుంది. మరోవైపు మంగళగిరిలో పోరు మామూలుగా లేదు. ఇప్పుడు గెలవడం కంటే మెజారిటీ పైన కూడా లోకేష్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అరకొర మెజారిటీ వచ్చినా నారా లోకేష్ విమర్శలు పాలు కాకతప్పదు. ఓటమి పాలు కాకుండా, గెలిస్తే మెజారిటీ ఇరవై వేలకు తగ్గకుండా చూసుకోవడమే ఇప్పుడు లోకేష్ ముందున్న లక్ష్యం. అందుకే లోకేష్ మంగళగిరిని వదిలిపెట్టడం లేదు.

గట్టి పోటీ కావడంతో….

గత ఎన్నికల్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం పన్నెండు ఓట్లతోనే విజయం సాధించారు. అప్పుడు బీసీ అభ్యర్ధి గంజి చిరంజీవి పోటీ చేశారు. చేనేత కుటుంబాలు, బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి రెండు ప్రధాన పార్టీలు అగ్రకులాలకు చెందిన వారినే దింపాయి. జనసేన పొత్తులో భాగంగా వామపక్ష పార్టీకి కేటాయించింది. ఇక్కడ వామపక్షాలు కూడా బలంగా ఉండటంతో ఎవరి ఓట్లు చీల్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. దీంతో లోకేష్ మంగళగిరిని వదిలిపెట్టకూడదని, ఎన్నికల వరకూ ఇక్కడే ప్రచారం చేసుకోవాలని ఆయనకు తండ్రి నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 17222 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*