లోకేష్ కు దొరికిందోచ్…?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేశ్‌.. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తార‌నే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌న్నింటినీ జ‌ల్లెడ ప‌డుతున్నా ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గం బాగుంటుంద‌ని ఒక‌రు.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గ‌మైతే సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉంద‌ని మ‌రొక‌రు.. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి చినబాబును గ్రాండ్‌గా లాంచ్ చేసే ప్ర‌య‌త్నాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ముందుగా లోకేష్‌.. త‌న తండ్రి రాజ‌కీయ అరంగేట్రం చేసిన చంద్ర‌గిరి మీద ప‌డింద‌ట‌. అయితే ఇక్క‌డ తొలిసారి గెలిచినా.. త‌ర్వాత నుంచి ఓడిపోవ‌డంతో పాటు పార్టీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింద‌ని తెలుస్తోంది. దీంతో ఇక్క‌డి నుంచి పోటీచేయ‌డం రిస్క్ అని భావించారు చంద్ర‌బాబు, లోకేశ్‌. ఇక ఏ జిల్లా చూసినా ప‌రిస్థితి ఇలానే ఉండ‌టంతో.. చివ‌ర‌కు గుంటూరుకే ఫిక్స్ అయ్యార‌ట‌. మంగ‌ళ‌గిరి అయితేనే మంచిద‌నే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

చంద్రగిరి అయితే….

చంద్ర‌గిరిలో ఎన్నిక‌ల వేళ స్థానిక నాయ‌కుల‌ను సమ‌న్వ‌యం చేయ‌డం చాలా ఇబ్బంది అని చంద్ర‌బాబు నేరుగా చేసిన హెచ్చిరిక‌ల‌తోనే లోకేశ్ ఇక్క‌డ పోటీ నిర్ణ‌యం విర‌మించుకున్నట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే లోకేశ్ పోటీకి కృష్ణా జిల్లా పెన‌మ‌లూరుతో పాటు హిందూపురం, ప‌ల‌మ‌నేరు ఇలా రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు వినిపించినా వేటిపై క్లారిటీ లేదు. దీంతో లోకేశ్‌ ఎక్క‌డి నుంచి పోటీచేస్తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. అయితే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల పేర్ల వినిపిస్తున్నా.. చంద్ర‌గిరి పేరు వింటేనే సీఎం చంద్ర‌బాబుతో పాటు లోకేశ్‌ కూడా ఉలిక్కి ప‌డుతున్నార‌ట‌. తొలిసారి 1978లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్క‌డి నుంచి పోటీచేసిన ఆయ‌న భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నంలో ఆయ‌న ఓడిపోయారు.

ఎన్టీఆర్ హయాంలో….

ఎన్టీఆర్ హ‌యాంలో చంద్ర‌గిరిలో టీడీపీ గెలిచినా.. 20 ఏళ్లలో ఇక్క‌డ టీడీపీ ఒక్క‌సారి కూడా గెల‌వ‌లేదు. అలాగే పార్టీకి ఇక్క‌డ ప‌ట్టు లేదు. దీంతో ఇక లోకేశ్‌కు గుంటూరు జిల్లానే గ‌తి అయిన‌ట్లు క‌నిపిస్తోంది. కొడుకును ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు చంద్ర‌బాబు వ్యూహాలు ర‌చిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే రాష్ట్ర స్థాయి ప‌ర్య‌ట‌న చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. లోకేశ్ రేపు రాష్ట్ర స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేప‌డితే అత‌డు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంలో అత‌డి గెలుపు వ‌న్‌సైడ్‌గా ఉండాలి… లేనిప‌క్షంలో అక్క‌డే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేయాల్సి వ‌స్తే స్టేట్‌వైడ్‌గా లోకేశ్ ప్ర‌భావం చూప‌డం చాలా క‌ష్టం అవుతుంది.

మెజారిటీ నేతలు…..

ఇప్పటికే లోకేశ్ పోటీ చేయబోయే నియోజకవర్గాల ఎంపిక కూడా పూర్తి అయిందని, మెజారిటీ సభ్యులు అయన గుంటూరులోని మంగళగిరి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై లోకేశ్, చంద్రబాబు కొంత సుదీర్ఘ పరిశీలనతో పాటు సీనియర్ల సలహాలు కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి, అమరావతి రాజధానిగా ఏర్పడ్డాక రాజకీయ నాయకులు, ప్రముఖులు రానున్న రోజుల్లో గుంటూరుకు వ‌స్తార‌ని తెలుస్తోంది.

నారాయణకూడా….

రాజ‌ధాని ప్రాంత స‌మీపంలోని మంగళగిరి, కాజా, తాడేపల్లి గ్రామాల్లోనే ఎక్కువగా తమ స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ చుట్టు ప‌క్కల ప్రాంతాల్లో పలు కంపెనీల స్థాపనకు కూడా ఏపీ ప్రభుత్వం యోచిస్తుండడం కూడా మ‌రో కార‌ణ‌మ‌ని సీనియ‌ర్లు భావిస్తున్నార‌ట‌. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులు గెలిచిన శాతం కూడా చాలా తక్కువని, ఏ విధంగా చూసుకున్నా ఈ సారి ఎలాగైనా మంగళగిరిలో తమ జెండా పాతాలని టీడీపీ శ్రేణులు కృతనిశ్చయంతో ఉన్నాయని సమాచారం. ఇక సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా చూసినా నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌, కాపు, బీసీలు ఎక్కువగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాను పోటీ చేస్తాన‌ని ప‌ది రోజుల క్రిత‌మే మంత్రి నారాయ‌ణ సైతం సీఎం చంద్ర‌బాబును అడిగిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ ట్విస్ట్‌లో చంద్ర‌బాబు ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*