నంద్యాల హామీకి నామం….!

ఏపీ జర్నలిస్టులకు చంద్ర బాబు ఝలక్ ఇవ్వబోతున్నారు. అమరావతిలో సొంతింటి కలలు కంటున్న వారి ఆశలపై బాబు నీళ్లు చల్లబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు అందరికి సొంత ఇంటిని సమకూరుస్తానని నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్ర బాబు హామీ ఇచ్చారు. ఆ తర్వాత దాని అమలు కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. గత బడ్జెట్ లో జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ తర్వాత 100కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించారు. చంద్ర బాబు ప్రకటన తర్వాత కొంతమంది కళ్ళు అమరావతి మీద పడ్డాయి.

హైదరాబాద్ నుంచి వచ్చి……

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి దిగి పడ్డ బ్యాచ్ కు అమరావతిలో ఇల్లు కట్టుకోవాలని కోరిక పుట్టింది. అనుకున్నదే తడవుగా తమ ఆలోచన సీఎం చెవిలో పడేశారు. ఆయన ముందు వెనుక ఆలోచించకుండా సై అనేశారు. ముఖ్యమంత్రి భరోసా ఇస్తే తమకు తిరుగేముంది అనుకున్న జర్నలిస్టులు ఓ కో- ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు. తొలుత రాజధాని ప్రాంతంలో పని చేస్తున్న జర్నలిస్టుల కు మాత్రమే సభ్యత్వం అంటూ మొదలు పెట్టారు. దీంతో గుంటూరు. ,మంగళగిరి ,తుళ్లూరు ప్రాంతాల జర్నలిస్ట్ లు కన్నెర్ర చేశారు. ఆ తర్వాత మమ్మల్ని వదిలేసి మీరు బాగు పడతారా? అని హైదరాబాద్ పెద్దలు గగ్గోలు పెట్టడం తో వాళ్ళని సభ్యులుగా చేర్చుకున్నారు. నేడో రేపో భూమి వచ్చేస్తుంది…. దానిని ప్రైవేట్ డెవలపర్ లకు ఇచ్చి ఫ్లాట్ లలో పాలు పొంగించడమే తరువాయి అన్నట్టు ప్రచారం చేశారు.సభ్యులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారై ఉండాలి అనడంతో చాలా మంది కింద మీద పడుతూ లోకల్ ప్రూఫ్ లు పుట్టించారు. కొత్త బ్యాంక్ అకౌంట్లు తెరిచి వాటితో తాము స్థానికులమే అని క్లెయిమ్ చేసుకున్నారు. ఇలా దాదాపు 2800 నుంచి 3వేల మంది తామంతా ఆంధ్రాకు చెందిన వారిమని., అమరావతిలో ఇల్లు కోరుకుంటూ సొసైటీ కి దరఖాస్తులు సమర్పించారు.

అభివృద్ది కి ఇచ్చి….

అమరావతిలో 33వేల ఎకరాలను ప్రభుత్వం భూ సమీకరణ పద్దతిలో సేకరించింది. ప్రభుత్వ సంస్థలు కాకుండా రాజధానిలో భూములు కోరిన వారికి ఎకరా 50లక్షల ధర చొప్పున కేటాయించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇదే ధరకు భూములు కొనుగోలు చేయడంతో తమకు కూడా అదే ధరకు భూమి కేటాయించాలి అని సొసైటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భూమిని ఎలా సద్వినియోగం చేస్తారనే ప్రశ్నకు ఒక డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించారు. ప్రభుత్వం దాదాపు 25 ఎకరాలు భూమి కేటాయిస్తే అందులో మూడు, నాలుగు రకాల ఫ్లాట్ లను నిర్మిస్తామని., సొసైటీ లో సభ్యులుగా ఉన్న వారి ఆర్థిక సామర్ధ్యాన్ని బట్టి ఫ్లాట్ ఎంచుకోవచ్చని., మిగిలిన వాటిని బిల్డర్ ఓపెన్ మార్కెట్ లో విక్రయించడం ద్వారా సొసైటీ సభ్యులపై భారం తగ్గుతుందని వివరించారు.

నిబంధనలకు విరుద్ధం…

నిజానికి వేలాది మంది రైతుల త్యాగంతో సేకరించిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం crda నిబంధనలకు విరుద్ధం. రెండోది జర్నలిస్ట్ కో ఆపరేటివ్ సొసైటీ కి భూమి కేటాయిస్తే తర్వాత ఉద్యోగులు., ఇతర వర్గాల నుంచి అదే రకమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కోరి చిక్కులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.ఈ సమస్యలను ప్రభుత్వ పెద్దలు ముందుగా ఉహించక పోవడం., అధికారుల వివరణతో పునరాలోచనలో పడినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలలో సభ్యులకు రాజధాని నిర్మాణాలను చూపే సమయంలో ., జర్నలిస్ట్ ల ఇళ్లు ఎప్పుడు., ఎక్కడ అని ప్రశ్నించడంతో మంత్రి నారాయణ అసలు సంగతి బయట పెట్టారు. అది అయ్యే పని కాదు.ఐ ఏ ఎస్ లు కొర్రీలు వేసి తిప్పి పంపినట్టు చెప్పడంతో అక్కడ ఉన్నవాళ్లు ఉసూరు మన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*