టీడీపీ సిట్టింగ్ లలో బ్యాడ్ రిపోర్ట్ వీరికే…!

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పని తీరు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పని తీరుపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్న ఆయన పనితీరు ఏ మాత్రం సరిలేని వారిని వచ్చే ఎన్నికల్లో తప్పించాలని నిర్ణయానికి వచ్చేశారు. ఈ క్రమంలోనే టీడీపీకి గత ఎన్నికలకు ముందు వరకు పెద్దగా పట్టులేని ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఉంచాలి… ఎవరిని తప్పించాలి అనే నిర్ణయానికి చంద్రబాబు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలిసింది.

లోపాలు సరిచేసుకోకుంటే……

ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జుల గెలుపుపై అనుమానాలు వస్తున్నాయని… మీ పని తీరులోనే లోపం ఉందని చెప్పిన చంద్రబాబు ఎన్నికల్లో కొన్ని మార్పులు చేర్పులు తప్పవని ఖ‌రాకండీగా చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఆరేడు నెలల టైం ఉండడంతో కాస్త అటూ ఇటూగా ఉన్నవారు తమ లోపాలు సరి చేసుకుంటే ఓకే.. లేకపోతే జిల్లాలో ఎవ్వరూ ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపిక ఉండడం ఐతే పక్కా. చంద్రబాబు నివేదికలో బ్యాడ్‌ రిపోర్ట్‌లో బాగా బ్యాడ్‌గా ఉన్నవారిలో పశ్చిమ ప్రకాశం నుంచి ఓ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు దాదాపు టిక్కెట్‌ లేనట్టే అని అంటున్నారు.

వీరికి నో టిక్కెట్……

ఇప్పుడున్న పరిస్థితులో అక్కడ టీడీపీ గెలుపు కష్టమే అన్న ప్రాధమిక నిర్ణయానికి కూడా ఆ పార్టీ వచ్చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటు ఇస్తే ఏ మాత్రం గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఆయనకు సీటు రాదంటున్నారు. సదరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి తనకు ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా ఆయన విజ్ఞప్తిని బాబు ఏ మాత్రం పట్టించుకుంటారన్నది కూడా సందేహంగానే ఉంది. ఇక త‌న‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల‌ పార్టీల అధ్యక్షుల‌తో ఏ మాత్రం పొసకకుండా… తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కుంటున్న మరో ఇన్‌ఛార్జ్‌కి టిక్కెట్‌ లేదని ఇప్పటికే దాదాపు తేలిపోయింది. చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న మరో ఎమ్మెల్యేకు సైతం అంత మంచి మార్కులు లేనప్పటికీ ఎన్నికల వేళ‌ ఆయన లోపాలను సరి చేసుకునేలలా బాబు ఓ ఛాన్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

గ్యాప్ లేకుండా చూసుకోవాలని…..

ఇక మంత్రి శిద్ధా రాఘవరావు మళ్ళీ దర్శి నుంచే పోటీ చేస్తారా ? లేదా చంద్రబాబు సూచనల మెరకు ఆయన ఎంపీగా వెళ్లి ఆయన కుమారుడు శిద్ధా సుధీర్‌ బాబు అసెంబ్లీ బరిలో ఉంటారా ? అన్నదానిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఒకవేల శిద్దా రాఘవరావు ఎంపీగా పోటీ చేస్తే ఆయన తనయుడు సుధీర్‌ బాబు పేరు దర్శి నుంచే కాకుండా జిల్లాలో మరో నియోజకవర్గం నుంచి కూడా పరిశీలనలో ఉంది. జిల్లాల్లో గత ఎన్నికల నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్న మరో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ సైతం ఆర్థిక ఇతర‌త్రా కారాణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదా అన్నది కూడా సందేహంగానే ఉంది. దీంతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చిన్న చిన్న సమస్యలతో ఉన్నా వారికి చంద్రబాబు తమ నియోజకవర్గంలో నాయకులతో ఎలాంటి గ్యాప్‌ లేకుండా చూసుకోవాలని చిన్నపాటి హెచ్చరికలతో చెప్పినట్టు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*