బాబు గురించి ఆ సీనియర్ల సీక్రెట్లు..విన్నారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొనాలో చెప్ప‌డం క‌ష్టం. సీనియ‌ర్ల‌యినా.. జూనియ‌ర్ల‌యినా.. ప్ర‌త్య‌ర్థుల కు దొరికితే.. ఇక‌, అంతే! ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. దాదాపు ఆయ‌న లెక్క‌ల ప్ర‌కారం 40 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయ‌లు చేస్తున్నారు. ఉద్దండ పిండాల‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు. జ‌లగం వెంగ‌ళ‌రావు, నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి, పీవీ న‌ర‌సింహారావు వంటి దిగ్గ‌జాల ద‌గ్గ‌ర కూడా ఆయ‌న రాజకీయాలు చేశారు. ఇక‌, ఆయ‌న స‌మ‌కాలికులు కిర‌ణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ర‌ఘువీరా రెడ్డి వంటి వారితోనూ రాజ‌కీయాలు చేశారు. అయితే, ఆయ‌న ఎప్పుడూ కూడా ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న టెన్ష‌న్ కానీ, ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌లు కానీ రాలేద‌ని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు.

బాబును ఇన్ని మాటలా?

తాజాగా.. అమ‌రావ‌తిలో చంద్ర‌బాబును భేటీ అయ్యేందుకు ప‌లు జిల్లాల నుంచి సీనియ‌ర్ నాయ‌కులు అమ‌రావ‌తికి వ‌చ్చారు. అయితే, అప్ప‌టికే చంద్ర‌బాబు అధికారుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్‌లో ఉండ‌డంతో వీరంతో ఒకే చోట చేశారు. ఈ సమ‌యంలో అక్క‌డే ఉన్న దిన‌ప‌త్రిక‌ల‌ను త‌లా ఒక‌టి అందుకున్నారు. వీటిలో ముఖ్యంగా ఒక దిన‌ప‌త్రిక‌ను తిర‌గేసిన తూర్పు గోదావ‌రికి చెందిన మంత్రి ఒక‌రు “బాబును ఇన్ని మాట‌లంటారా?“ అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఈస‌డించారు. అక్క‌డే ఉన్న గుంటూరుకు చెందిన మ‌రో మంత్రి.. అందుకుంటూ.. “నేను కూడా పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్నాను. ఇన్ని మాట‌లు ఆయ‌న ఎప్పుడూ ప‌డ‌లేదు“ అని ముక్తాయించారు. వాస్త‌వానికి వీరి సంభాష‌ణ‌ను అక్క‌డే ఉన్న మీడియా వ‌ర్గాలు గ‌మ‌నిస్తూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ప్రతిపక్షమే అవసరం లేదంటూ…..

వీరు చెప్పిన మాట‌ల్లో వాస్త‌వం లేక‌పోలేద‌ని ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సైతం వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అయితే, చంద్ర‌బాబును బ‌ట్టే క‌దా ఎదుటివారు విమ‌ర్శించేది? అని చ‌ర్చ‌ల‌లో పాల్గొన్న ఓ జ‌ర్న‌లిస్టు వ్యాఖ్యానించారు. ఆయ‌న సీనియ‌ర్ మోస్ట్ అయినా.. రాజ‌కీయాల్లో ఆయ‌న హుందాగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌ని, రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌సరం లేద‌ని అన‌డం ఆయ‌న నియంతృత్వ ధోర‌ణికి అద్దం ప‌ట్టిందంటూ.. గ‌తంలో ఓ ఆంగ్ల ప‌త్రిక రాసిన క‌థ‌నాన్ని ఆయ‌న చూపించ‌డం గమ‌నార్హం.

గతంలో జగన్ కు ముడిపెట్టి……

ఇక‌, విప‌క్ష నేత జ‌గ‌న్‌ను ప్ర‌తి విష‌యానికి టార్గెట్ చేయ‌డం కూడా అంద‌రినీ న‌వ్వుల పాలు చేస్తోంది. స‌చివాల‌యంలో నిర్మాణాలు నాణ్య‌త లేక‌పోవ‌డం, అవినీతి శ్లాబులు శ్లాబులుగా ప‌డ‌డంతో నీళ్లు ఇప్పుడు ముంచెత్తుతున్నాయి. మ‌రి వీటిని కూడా గ‌తంలో చంద్ర‌బాబు జ‌గ‌న్‌కే ముడి పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సీనియార్టీనే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతోంద‌ని ఒక‌రిద్ద‌రు జ‌ర్న‌లిస్టులు కూడా పేర్కొన‌డం.. ఇంత‌లోనే బాబు నుంచి కాల్ రావ‌డంతో అంద‌రూ మూకుమ్మ‌డిగా ఆయ‌న చాంబ‌ర్‌లోకి వెళ్లారు!!